ఖలీల్‌వాడి/వర్ని, మార్చి 27 : టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధుల వలసలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. 39వ డివిజన్ కార్పొరేటర్ లతా కృష్ణ, 44వ డివిజన్‌కు కార్పొరేటర్ బైకాన్ సుధా మధు టీఆర్ఎస్లో చేరగా, హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులపై వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
డీసీసీబీ చైర్మన్ సమక్షంలో 50 మంది చేరిక
వర్ని మండలం పాత వర్ని గ్రామానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వర్ని మండల కేంద్రం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
బీజీపీకి పంజాబ్ గతే..
రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి ముందుముందు అన్ని రాష్ర్టాల్లో పంజాబ్ గతే పడుతుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్లో చేరికల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్ల చట్టాలను నిరసిస్తూ పంజాబ్ రైతులు ప్రధాన మంత్రినే అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఢిల్లీ ఉద్యమంలో 800 మంది అన్నదాతల ప్రాణాలను కేంద్ర ప్రభుత్వం పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే బీజేపీ నాయకులను తిరగనివ్వబోమని హెచ్చరించారు. బండి సంజయ్‌కి దమ్ముంటే కేంద్రంతో మాట్లాడి డీజిల్, పెట్రోలు, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సవాల్ విసిరారు. జిల్లాలో పసుపు బోర్డుపై మాటతప్పిన ఎంపీ అర్వింద్‌కు రైతులే గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే, బీజేపీ.. రాజకీయ లబ్ధికోసం ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నదని మండిపడ్డారు. జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, నారోజీ గంగారాం, ఎంపీపీ శ్రీలక్ష్మీ వీర్రాజు, వైస్ ఎంపీపీ బాలరాజు, మండల కో-ఆప్షన్ సభ్యుడు కరీం, ఏఎంసీ వైస్ చైర్మన్ గోపాల్, విండో చైర్మన్లు సాయిబాబా, కృష్ణారెడ్డి, సర్పంచులు పద్మా నాగభూషణం, రాజు, నాయకులు గిరి, సంతోష్, అంబర్ సింగ్, శ్రీను, దిలారి బాబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.