నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 27 : యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉమ్మడి జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. పంజాబ్ తరహాలో మనరాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేసే వరకూ విశ్రమించవద్దని, ఆందోళనలను ఉధృతం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో ఆదివారం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. అనంతరం తీర్మాన కాపీలను ప్రధాని మోదీకి పోస్టుద్వారా పంపించారు. ఆర్మూర్‌లో నిర్వహించిన సమావేశంలో టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. రెంజల్, డిచ్పల్లి మండల సమావేశాల్లో బీజేపీకి చెందిన ఎంపీపీలు తీర్మానం చేయగా, ఎంపీటీసీలతోపాటు సభ్యులు మద్దతు పలికారు.