ఖలీల్‌వాడి, నవంబర్ 10: నగర శివారులోని మల్లారం వద్ద ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్షిప్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకునే నాటికి రోడ్లు, డ్రైనేజీలు, నీటి వసతి, విద్యుద్దీకరణ తదితర సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే బీటీ రోడ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయినట్లు తెలిపారు. ధాత్రి టౌన్షిప్లో ప్లాట్ల విక్రయానికి ఈనెల 14న న్యూ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు గురువారం ధాత్రి టౌన్షిప్ వద్ద మరోసారి ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, వైద్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఔత్సాహికులు హాజరయ్యారు. ధాత్రి టౌన్షిప్ ప్రత్యేకతలను కలెక్టర్ వివరిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్ఆర్ఐలకు సులభ వాయిదాల వెసులుబాటుతో రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు.
సువిశాలమైన 60 ఫీట్ల అప్రోచ్ రోడ్డు, 30 నుంచి 40 ఫీట్ల విస్తీర్ణంతోకూడిన అంతర్గత రోడ్లు, మిషన్ భగీరథ ప్రత్యేక పైపులైన్ ద్వారా నీటి వసతి, విద్యుత్ సరఫరా, సీసీ డ్రైన్లు, ఎస్టీపీ నిర్మాణాలను మూడు నెలల కాల వ్యవధిలో పూర్తి చేయిస్తామన్నారు. మొత్తం 76 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ప్రస్తుతం 36.11 ఎకరాల స్థలాన్ని లేఅవుట్ అనుమతి పొంది వివిధ సైజుల్లో మొత్తం 316 ప్లాట్లు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.
తొలి విడుతలో 80 ప్లాట్ల విక్రయాల కోసం ఈనెల 14న ఉదయం 9 గంటలకు న్యూకలెక్టరేట్లో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి రోజున 40 ప్లాట్లకు ఆ మరుసటి రోజైన 15న మరో 40 ప్లాట్లకు వేలం ఉంటుందన్నారు. ఈఎండీ రూ.10 వేలు చెల్లించి బహిరంగ వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని సూచించారు. ఒకే ఈఎండీతో అన్ని ప్లాట్ల వేలంలోనూ పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. వేలంలో ప్లాట్ రాని వారికి ఈఎండీ వాపస్ ఇస్తామన్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు అయినందున శుక్రవారం సాయంత్రంలోగా జిల్లా కలెక్టర్ నిజామాబాద్ పేరిట డీడీలు తీసుకోవాలని సూచించారు.
రాజీవ్ స్వగృహ పథకంలో ఇదివరకు దరఖాస్తు చేసుకొని రూ. మూడు వేల రుసుము చెల్లించిన వారు ఒరిజినల్ ఈ-సేవ రసీదును సమర్పించి వేలంలో పాల్గొనే వెసులుబాటు ఉందన్నారు. ప్లాట్ కేటాయించబడిన నాటి నుంచి 7 రోజుల వ్యవధిలో ప్లాట్ విలువలో 33 శాతం, 45 రోజుల వ్యవధిలో రెండో విడుత కింద మరో 33 శాతం, 90 రోజుల వ్యవధిలో మిగతా మొత్తాన్ని చెల్లించి ప్లాట్‌ను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.
ఒకే విడుతలో మొత్తం రుసుము చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి ప్లాట్ ధరలో రెండు శాతం రిబేటు వర్తిస్తుందన్నారు. మధ్య తరగతి కుటుంబాల వారికి కూడా ప్లాట్ల కొనుగోలుకు అవకాశం ఉండాలనే ఉద్దేశంతో 178 చదరపు గజాలు, 200, 267, 300 చదరపు గజాలుగా మొత్తం నాలుగు సైజుల్లో ప్లాట్లను రూపొందించామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఏసీపీ వెంకటేశ్వర్, ఆర్డీవో రవి, టీఎస్ఐఐసీ అధికారులు రాందాస్, దినేశ్, రూరల్ తహసీల్దార్ అనిల్ పాల్గొన్నారు.