నింబాచల క్షేత్రం హరి నామస్మరణతో మార్మోగింది. దక్షిణ బద్రినాథ్‌గా ప్రసిద్ధిచెందిన లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భీమ్‌గల్ గ్రామాలయం నుంచి ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించిన పల్లకీలో ఉంచి గుట్టపైకి మంగళహారతులు, డప్పు వాయిద్యాలతో తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
భీమ్‌గల్, అక్టోబర్ 30: నారసింహుడి నామ స్మరణతో భీమ్‌గల్ పట్టణం మార్మోగింది. లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి కార్తికమాస బ్రహ్మోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తరఫున గ్రామ దేవతలకు సారెను సమర్పించారు. అనంతరం అందంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవ మూర్తులను డప్పు వాయిద్యాల మధ్య ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ గుట్టపైకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు బోనాలు, మంగళహారతులతో నీరాజనం పలికారు.
కార్తిక మాసాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా 3న స్వామివారి కల్యాణం, 7న జాతర ఉంటుందని ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. కార్యక్రమంలో పురోహితులు నంబి పార్థసారథి, నంబి వాసుదేవాచార్యులు, నంబి వేణు, నంబి ప్రణీత్ , నంబి మహేశ్‌తోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.