బోధన్, మార్చి 24: ‘ఛత్రపతి శివాజీ గొప్ప మహానీయుడు.. అటువంటి మహానీయుడి గురించి మాటల్లో చెప్పలేం.. అటువంటి మహానుభావుడి విగ్రహం కొందరు రాత్రివేళ రహస్యంగా, కుట్రపూరితంగా పెట్టడం వల్లే బోధన్‌లో అలర్లు జరిగాయి. బోధన్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదమవడం బాధాకరం.. దురదృష్టకరం..’ అని బోధన్ శాసనసభ్యుడు మహ్మద్ షకీల్ ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్‌లోని ఎమ్మె ల్యే కార్యాలయంలో గురువారం రాత్రి ఆయన వి లేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల బో ధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయమై జరిగిన పరిణామాలపై భావోద్వేగానికి గురయ్యారు.. శివాజీలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ప్రజలందరి సమక్షంలో ఎంతో గొప్పగా ఆవిష్కరించుకోవాల్సిందిపోయి.. కొంతమంది రాత్రికి రాత్రే ఏర్పా టు చేయడంతోనే అలర్లు జరిగాయని ఆయన అన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహంతో పాటు మరో ఐదు విగ్రహాల ఏర్పాటుకు మున్సిపాలిటీ తీర్మానం చేసిందని అయితే, వాటి స్థలం విషయంలో ఇంకా నిర్ణయం జరగలేదన్నారు. స్థల నిర్ణయం జరిగిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆమోదించాల్సి ఉంటుందన్నారు.
ఇదంతా త్వరలో జరుగుతుందని, మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందిన శివాజీ విగ్రహంతో పాటు మహాత్మా బసవేశ్వర, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, అబుల్ కలాం ఆజాద్, అబ్దుల్ కలాం విగ్రహాలను తానే స్వయంగా ఆవిష్కరిస్తానని ఎమ్మెల్యే షకీల్ స్పష్టంచేశారు. వాస్తవానికి శివాజీ విగ్రహం ఏర్పాటును ఏ వర్గంవారు వ్యతిరేకించడంలేదని, ఒక పద్ధతి ప్రకారం అన్ని విగ్రహాలకు ఒకేసారి స్థల నిర్ణయం జరగాలనే అందరూ కోరుకుంటున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న గత ఎనిమిది సంవత్సరాల్లో ఎటువంటి మత వివాదాలు బోధన్ నియోకవర్గంలో ఏర్పడలేదన్నారు. తాను అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడానని, అందరూ కూడా శాంతి, సామరస్యాలతో ఉండేందుకు సుముఖంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం బోధన్ ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం పొందిన ఆరు విగ్రహాలను ఎక్కడెక్కడ పెట్టాలన్న విషయమై జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఏసీపీ, మున్సిపల్ కమిషనర్లతో ఏర్పడిన కమిటీ పరిశీలిస్తుందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లు ఉండవన్నారు. అయితే, ఎవరైనా అమాయకులు ఉన్నట్లయితే, వారిపై కేసులు పెట్టవద్దని పోలీస్ అధికారులను కోరానన్నారు. శివాజీ విగ్రహం ప్రారంభోత్సవాన్ని ప్రజలందరి సమక్షంలో గొప్పగా నిర్వహిస్తామన్నారు.
కొన్ని ఛానళ్లు నన్ను టార్గెట్ చేశాయి
‘ఇటీవల జూబ్లీహిల్స్ కారు ప్రమాదం, బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదం విషయంలో తనను కొన్ని టీవీ ఛానళ్లు ఉద్ధేశపూర్వకంగా టార్గెట్ చేయడం బాధాకరం.. నేను మైనార్టీ ఎమ్మెల్యే అయినందునే ఆ ఛానళ్లు నా వెంటపడుతున్నాయి. నన్ను, నా కుటుంబసభ్యులను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాయి. నన్ను టార్గెట్ చేసిన ఆ ఛానళ్ల యజమానుల్లో భూ ఆక్రమణదారులు, బ్లాక్ మెయిలర్లు ఉన్నారు. నన్ను క్రిమినల్ ఎమ్మె ల్యే, వివాదాస్పద ఎమ్మెల్యే అంటూ దురుద్ధేశపూర్వకంగా నా కుటుంబంపై ప్రసారాలు చేస్తున్నా యి…’ అంటూ బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సదరు టీవీ ఛానళ్లపై మండిపడ్డారు. జాబ్లీహిల్స్ కారు ప్రమాదంలో నా కుమారుడు డ్రైవింగ్ చేయలేదని, ఆ కారులో ఉన్నాడని, అంతమాత్రాన ఏదో తప్పు చేసినట్లు.. చిన్న పిల్లవాడని కూడా చూడకుండా సదరు ఛానళ్లు తప్పుడు ప్రసారాలు చేశాయన్నారు. అలాగే, బోధన్ శివాజీ విగ్రహం విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా, విద్వేషాలు రెచ్చగొడుతూ తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేయడం బాధాకరమన్నారు. ‘నేను ఏదైనా తప్పుచేస్తే.. వారి స్టూడియోలకు పిలవవచ్చు.. నిజానిజాలు నేనే చెబుతా.. దుబాయ్‌లో నేను ఉండగా, ఇక్కడ ఇలాంటి దురద్ధేశపూరిత ప్రసారాలు చేయ డం తగదు’ అని షకీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ఛానళ్లను విడిచిపెట్టేదిలేదని, వారి వెంటపడతానని హెచ్చరించారు. ఆ ఛానళ్ల అవినీతి బాగోతాన్ని బయటపెడతానని, త్వరలో పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే షకీల్ హెచ్చరించారు.