ఖలీల్వాడి,మార్చి 24: ఒకరి నుంచి ఒకరికి సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి టీబీ(క్షయ). దీనిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. గతంలో ఈ వ్యాధి నివారణకు పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండేవి కావు. కానీ, ఇప్పుడు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారణ అత్యంత సులువని, మందులు వాడడంలో నిర్లక్ష్యం వీడితేనే క్షయ నివారణ సాధ్యమని వైద్యులు చెబుతున్నారు. ఈ క్షయ వ్యాధి మైకో బాక్టీరియమ్ ట్యూబర్క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. మైకోబాక్టీరియమ్ ట్యూబర్క్యూలోసిస్ అనే బ్యాక్టీరియాను 1882 మార్చి 24న రాబర్ట్కాక్ అనే జర్మనీకి చెందిన వైద్యుడు కనుగొన్నాడు. అప్పటి నుంచి మార్చి 24ను ఏటా ప్రపంచ టీబీ నివారణ దినంగా నిర్వహిస్తున్నారు.
ఒకరి నుంచి ఒకరికి…
అంటువ్యాధి అయిన క్షయ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. క్షయ వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా సమీపంలోని ఆరోగ్యవంతులైన వారికి సోకే ప్రమాదం ఉంది. క్షయ రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లను ఎదుటి వ్యక్తి పీల్చినప్పుడు ఈ వ్యాధి అట్టే సంక్రమిస్తుంది. ఆహారం, తాగేనీటి ద్వారా ఈ వ్యాధి సంక్రమించదు. లక్షణాలను గమనించి ముందుగానే సమీప దవాఖానకు వెళ్లి వైద్యుడిని సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఎక్స్రే చేయించుకొని ముందుగా టీబీ వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులభతరమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లో టీబీ..
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు టీబీ సోకే అవకాశం మెండుగా ఉంటుంది. 60శాతం హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు క్షయ సోకుతుంది. వీరిలో ఒకరోజు కన్నా ఎక్కువ దగ్గు, జ్వరం ఉండడం, రాత్రివేళల్లో చెమటలు పట్టడం, అకారణంగా నీరసం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వారికి టీబీ సోకినట్లుగా నిర్ధారించవచ్చు. ఈ లక్షణాలు ఉన్నవారు టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. హెచ్ఐవీకి వాడే మందులతోపాటు టీబీ నివారణ మందులను క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
నిర్ధ్ధారణ – చికిత్స కేంద్రాలు
జిల్లా జనరల్ దవాఖాన, మెడికల్ కళాశాల మాలపల్లి అర్బన్ దవాఖాన, ఆర్మూర్ సీహెచ్సీ, నందిపేట పీహెచ్సీ, బాల్కొండ పీహెచ్సీ, ప్రగతి దవాఖాన, కమ్మర్పల్లి, భీమ్గల్, డిచ్పల్లి, వర్ని, ధర్పల్లి, కోటగిరి, బోధన్, నవీపేట, ఎడపల్లిలోని దవాఖానల్లో తెమడ పరీక్షలు నిర్వహిస్తారు. నిజామాబాద్ దవాఖానలోని క్షయ నియంత్రణ కేంద్రం, ఆర్మూర్, వర్ని, నందిపేట్, డిచ్పల్లి, బాల్కొండ, మోర్తాడ్, ధర్పల్లిలో చికిత్సా కేంద్రాలు ఉన్నాయి.
ఎక్స్రే కేంద్రాలు :
క్షయ నిర్ధారణకు జిల్లా ప్రభుత్వ దవాఖానల్లో నాలుగు ఎక్స్రే కేంద్రాలు ఉన్నాయి. జిల్లా జనరల్ దవాఖాన, ఆర్మూర్ (సీహెచ్సీ), బోధన్ (ఏరియా దవాఖాన), ధర్పల్లి (సీహెచ్సీ) కేంద్రాల్లో ఎక్స్రే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.
వ్యాధి నిర్ధారణ..
క్షయ వ్యాధిని మొదటి దశలో ఉదయం వ్యాధిగ్రస్తుడు ఉమ్మిన తెమడను పరీక్షించి నిర్ధారిస్తారు. ఎక్స్రే ద్వారా సైతం నిర్ధారించవచ్చు. కలర్ పరీక్ష ద్వారా క్షయ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సీబీనాట్ అనే పరీక్ష ద్వారా రెండు గంటల్లో వ్యాధిని నిర్ధారించవచ్చు. కానిట్రెడ్జ్ బెస్ట్ న్యూక్లిక్ ఆసిడ్ ఆంప్లిఫికేషన్ (సీబీనాట్) పరీక్ష విధానంలో తెమడ పరీక్ష కాకుండా మిగతా బయాలాజికల్ నమూనాలు అన్నింటినీ తీసుకొని పరీక్ష చేస్తారు. తద్వారా సత్వర నిర్ధారణతోపాటు ఈ పరీక్ష ద్వారా ఎండీఆర్, టీబీగా నిర్ధారణ అయితే తక్షణమే వైద్యాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
క్షయ లక్షణాలు – సంక్రమణ…
అంటువ్యాధి అయిన క్షయ(టీబీ) లింగబేధం లేకుం డా ఎవరికైనా సోకుతుంది. ఎక్కువగా ఊపిరితిత్తులకు సోకుతుంది. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం వేళల్లో తరుచూ జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చాతిలో నొప్పి, లింపు గ్రంథుల్లో నొప్పి, తెమడలో రక్తచారలు పడడం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. ఈ వ్యాధి గోర్లు, వెంట్రుకలకు మినహాయించి ఊపిరితిత్తులతోపాటు శరీరంలోని ఏభాగానికైనా సోకవచ్చు. రక్తప్రసరణ జరిగే అన్ని భాగాలకు క్షయ సోకుతుంది. ఊపిరితిత్తులకు కాకుండా శరీరంలో ఇతర భాగాలకు సోకితే దానిని ఎకోస్ట్రా పల్మనరీ టీబీగా పరిగణిస్తారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పుట్టిన పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇప్పించాలి. దగ్గినా, తుమ్మినా నోటికి గుడ్డ లే దా రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మరాదు. ఉమ్మితే దానిపై మట్టిని కప్పాలి. ఎక్కువ ప్రొటీన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. వ్యాధిగ్రస్తులు ఉన్న ఇంట్లో ఆరేండ్లలోపు పిల్లలు ఉంటే వారికి వైద్యుని సల హా మేరకు ఐసోనియోజైడ్ మందులను ఇప్పించాలి. వ్యాధిగ్రస్తులు వైద్యుడి సలహా మేరకు నిర్ణీత సమయం వరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి.
క్రమం తప్పకుండా మందులను వాడాలి..
క్షయ వ్యాధి మందుల వాడకంతో సులువుగా నివారించే వ్యాధి. వ్యాధి నిర్ధారణ అనంతరం వైద్యుడు సూచించినన్ని రోజులు మందులు క్రమం తప్పకుండా వాడాలి. పోషకాహార పదార్థ్ధాలను తీసుకోవాలి. మందులు వాడుతున్న సమయంలో వ్యాధి లక్షణాలు తగ్గినట్లు అనిపిస్తే మందులు వేసుకోవడం మానొద్దు. కోర్సు మధ్య లో మందులు మానేస్తే అవి శరీరంపై పనిచేయకుం డా పోతాయి. ఇలాంటి సమయంలో వ్యాధిని నివారించడం కష్టతరమవుతుంది. వ్యాధిగ్రస్తులు మందు లు వాడుతున్న సమయంలో యాక్షన్, రియాక్షన్ ఏ మి ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
– డాక్టర్ రాజేశ్వర్ (పల్మనాలజిస్ట్)