నిజామాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏడున్నరేండ్ల క్రితం మొదలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. పేదింట్లో శుభ కార్యానికి ఎంతగానో ఆసరా అవుతున్నది. అప్పులు చేసి బిడ్డల పెండ్లిళ్లు చేయాల్సిన దుస్థితి నుంచి అనేక పేద కుటుంబాలు ఇప్పుడు ఈ పథకాల ద్వారా మంజూరవుతున్న మొత్తంతో ఊరట చెందుతున్నా యి. నిజామాబాద్ జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 10వేల మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం అందింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 57,230 మందికి లబ్ధి చేకూరింది. మొత్తం రూ.480 కోట్లు నిధులను ప్రభుత్వం వెచ్చించింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని అక్టోబర్ 2, 2014న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. గ్రామాల్లో రూ.లక్షన్నర ఆదాయం, పట్టణాల్లో రూ.2లక్షల ఆదాయం ఉన్న వారికి ఈ పథకం వర్తించేలా నిబంధనలు పెట్టారు. 18 ఏండ్లు నిండిన తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలే ఈ పథకానికి అర్హులు. తొలినాళ్లలో కల్యాణలక్ష్మి సాయం రూ.51 వేలు మాత్రమే అందేది. 2017 మార్చి 13న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయాన్ని రూ.51వేల నుంచి రూ.75,116లకు పెంచారు. ఇది కాస్త 2018, ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.లక్షా 116కు పెరిగింది.
57వేల మందికి రూ.480కోట్లు పంపిణీ…
పెద్ద మొత్తంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం చేస్తున్న ప్రభుత్వం… అర్హుల ఎంపిక, నిధుల మంజూరులో పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నది. లబ్ధిదారులకు సాయాన్ని చెక్కుల రూపంలో అందిస్తున్నది. నేరుగా ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల చేతుల మీదుగా రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటిని పంపిణీ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుండడంతో అవకతవకలకు అవకాశం లేకుండా పోయింది. పథకం ప్రారంభం నుంచి నేటి వరకు నిజామాబాద్ జిల్లాలో 57,230 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు. వీటి మొత్తం విలువ రూ.480 కోట్లుగా ఉన్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పేదింట ఆర్థిక కష్టాలను తీరుస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున అర్హులైన వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నది. ఏటా పేదింటి యువతుల వివాహాలకు సంబంధించి ఆర్థిక సాయం అందించే ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నది. వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లుగానే అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆర్థిక సాయం మంజూరుకు సిఫారసు చేస్తున్నారు. దాదాపు లబ్ధిదారుల వివాహానికి ముందే రూ.లక్షా 116 చెక్కును అప్పగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సాయం పెంపు… సడలింపులు…
సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో పెడ్లంటే అదో ప్రహసనం. ఆడబిడ్డ కుటుంబం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. సమాజంలో వరకట్నాన్ని నిషేధించినా బాహాటంగానే కట్నకానుకలు ఇచ్చి పుచ్చుకోవడం, ఆడంబరంగా పెండ్లిని జరిపించడం అంటే వధువు కుటుంబంపై ఎనలేని భారమే. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ పేదింట్లో పెళ్లి భాజాభజంత్రీలు మోగుతున్నాయి. భారంగా మారిన ఈ తంతు ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కొం డంత అండగా నిలుస్తున్నారు. పెండ్లి కూతురుకు మేనమామలా ఆర్థిక సాయం చేసి శుభ కార్యంలో చేదోడుగా నిలుస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ప్రారంభ దశలో ఆర్థిక సాయం రూ.51వేలతో మొదలైంది. ఇప్పుడీ అద్భుత పథకం సీఎం మానవతా దృక్పథంతో రూ.లక్ష 116కు చేరింది. ఆడబిడ్డల పెండ్లిళ్లకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం రూ.1,00,116 ఉండడంతో ఆయా కుటుంబాలకు నగదు సాయం ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఈ పథకానికి అర్హతల్లో నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం గతంలో సడలించింది. వార్షిక ఆదాయం రూ.లక్ష దాటితే పేదవారిగా గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించేవారు. మారిన పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లబ్ధిదారుల వార్షిక ఆదాయాన్ని పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల ఆదా యం రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలుగా నిర్ణయించారు.
బాల్య వివాహాలకు అడ్డుకట్ట…
వధువు వయస్సు 18 ఏండ్లు దాటి ఉండడంతో పాటు తెలంగాణ వాస్తవ్యులకే ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. పారదర్శకతకు పెద్దపీట వేయడంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల చేతికే సులువుగా డబ్బులు అందుతున్నాయి. చెక్కుల రూపంలో నేరుగా వధువు తల్లిదండ్రులకే ఆర్థిక సాయం చేరుతున్నది. ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వ సాయం అందాలంటే నిబంధనల మేరకు నిర్ణీత వయసు నిండి ఉండాల్సిన గత్యంతరం ఏర్పడింది. ఫలితంగా గ్రామాల్లో బాల్య వివాహాలు సగానికి ఎక్కువగా తగ్గుముఖం పట్టాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి ముందు చాలా చోట్ల బాల్య వివాహాలు జోరుగా జరిగేవి. ప్రభుత్వ యంత్రాంగం నిఘా పెట్టినప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండేది. కేసీఆర్ అందిస్తున్న ఆర్థిక సాయం లక్షా 116 రూపాయలు ఉండడంతో పేదింట్లో వివాహ ఖర్చులకు అప్పులు చేయాల్సిన అవసరం తప్పుతున్నది. వధువు తల్లిదండ్రులు తప్పనిసరిగా నిబంధనలు అనుసరించి వివాహాలు చేయిస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో అమ్మాయిల వివాహాలకు తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే సాయం అందించడం దేశంలోనే ప్రథమం కావ డం విశేషం.