బాన్సువాడ, మార్చి 19: ఉపాధి హామీ పనులను మార్చిలోపు షెడ్యూల్ ప్రకారం ప్రారంభించి పూర్తిచేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం ఆయన పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాన్సువాడ రూరల్, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు. అభివృద్ధి పనులకు మంజూరైన స్పెషల్ డెవలప్మెంట్ నిధులు, పంచాయతీ రాజ్ శాఖ, గ్రామాల్లో మంజూరు చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులపై సమీక్షించారు. పనుల పురోగతిపై గ్రామాల వారీగా అడిగితెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కోసం కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ప్రకటించిన జీపీకి రూ. పది లక్షలు డ్రైనేజీ వ్యవస్థ కోసం ఖర్చుచేయాలని అన్నారు. గ్రామాలకు అవసరమైన నిధులకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. ఇతర ప్రాంతాల్లో నిధులు రాక ఇబ్బందులు పడుతున్నారని, సీఎం కేసీఆర్ దయతో బాన్సువాడకు అటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, పీఆర్ ఈఈ, ట్రాన్స్‌కో ఏడీ శ్రీనివాస్ రావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, ఆత్మకమిటీ అధ్యక్షుడు మోహన్‌నాయక్, విండో చైర్మన్ పిట్ల శ్రీధర్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్, ఎంపీపీ విఠల్ తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్‌ను కలిసిన ఉపాధి హామీ సిబ్బంది
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిని ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఈజీఎస్‌లో కాంట్రాక్టుపై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలని కోరుతూ స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయాన్ని సీఎంవో కార్యాలయానికి పంపిస్తానని స్పీకర్ చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్పీకర్, డీసీసీబీ చైర్మన్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్‌ను కలిసిన వారిలో టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు కృష్ణాగౌడ్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, ఏపీవోల సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి, కార్యదర్శి సక్కుబాయి, పీవోల అధ్యక్షుడు గంగ సర్సింహులు, సాంబాజీ, సుదర్శన్, సాయిలు , చంద్రశేఖర్, సాయిబాబా, భాస్కర్, ఫీల్డ్ అసిస్టెంట్లు దత్తురాజ్, పోశెట్టి, శ్రావణ్, ధరంసింగ్, గణేశ్, ఆంజనేయులు, ప్రదీప్, బస్వయ్య తదితరులు ఉన్నారు.