విద్యానగర్/ ఇందూరు, మార్చి 19 : గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించి అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో పాఠకులకు మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచాలన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినదని, అదే ఒరవడిని కొనసాగించడానికి ప్రజా ప్రతినిధులు, దాతలు, అధికారులు, ఉద్యోగుల సహాయ సహకారాలు అందించాలని కోరారు.
గ్రంథాలయాల అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గ్రంథాలయంలో అన్ని విభాగాలను సందర్శించి, పాఠకులతో మాట్లాడారు. సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ అభివృద్ధి కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పున్న రాజేశ్వర్ చేపట్టిన కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట గ్రంథాలయ కార్యదర్శి బుగ్గారెడ్డి, సిబ్బంది ఉన్నారు. అనంతరం అయాచితం శ్రీధర్ నిజామాబాద్ జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించారు. సంస్థ చైర్మన్గా ఆరుట్ల రాజేశ్వర్ నియామకమైన వెంటనే కేంద్ర గ్రంథాలయాన్నీ సందర్శించి అక్కడ పాఠకులు ఎదుర్కొంటున్న సమస్యలను నివేదిక రూపంలో రూపొందించినందుకు ఆయనను అభినందించారు. వీలైనంత త్వరగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకమైన హాలులో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయిస్తామన్నారు.