కామారెడ్డి, మార్చి 10 : సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఉద్యోగ ప్రకటనతో కామారెడ్డి జిల్లాకు 1340 పోస్టులురాగా, రాజన్న జోన్, మల్టీ జోన్ పరిధిలో మరిన్ని క్యాడర్ పోస్టులు అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో కామారెడ్డి జిల్లాలో ఉద్యోగుల సంఖ్య మరింత పెరుగనున్నది. ఇటీవల బదిలీల ప్రక్రియ చేపట్టగా అదనంగా బదిలీతోపాటు ప్రమోషన్‌పై ఉద్యోగులు వచ్చారు. జిల్లాలో ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 7614 మంది ప్రభుత్వ ఉద్యోగులు
జిల్లాలో ప్రస్తుతం 7614 మంది ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ బేస్ కింద వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 520 గెజిటెడ్, 6,570 మంది నాన్ గెజిటెడ్, 524 మంది నాల్గో తరగతి ఉద్యోగులు ఉన్నారు. వీరితోపాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కింద వివిధ శాఖల్లో పలువురు పని చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాకు 1340 పోస్టులను భర్తీ చేయాలని నోటిఫై చేస్తూ సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతోపాటు కామారెడ్డి జిల్లా రాజన్న జోన్ పరిధిలో 2,403 ఉద్యోగాల ప్రకటన విడుదల చేశారు.
మల్టీ జోన్ -1 పరిధి కింద 6,800, మల్టీ జోన్-2 కింద 6370 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల పరిధిలో కామారెడ్డి జిల్లావాసులకూ అవకాశం లభించనున్నది. వీటితోపాటు గ్రూప్-1,2,3,4 పోస్టులకు కూడా నిరుద్యోగులు పోటీ పడే అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లాతోపాటు రాజన్నజోన్, మల్టీ జోన్-1 కింద మొత్తం 10,543 పోస్టులకు జిల్లా వాసులు పోటీ పడనున్నారు. ఇందులో 95శాతం పోస్టులు స్థానికులకు, కేవలం 5శాతంలోపు స్థానికేతరులకు ఉండేలా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల చేపట్టిన బదిలీల్లో కామారెడ్డి జిల్లా నుంచి 890 మంది ఇతర జిల్లాలకు వెళ్లగా, 1240 మంది ఉద్యోగులు ఇతర జిల్లాల నుంచి కామారెడ్డికి వచ్చారు.
రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధి నుంచి జిల్లాకు బదిలీపై వచ్చారు. మొత్తం 350మంది ఉద్యోగులు కామారెడ్డి జిల్లాకు అదనంగా రావడం గమనార్హం. పోలీస్ శాఖలో 145 మందికి బదిలీలు చేపట్టగా, వీరిలో నలుగురు సీఐలు బదిలీపై వెళ్లగా, మరో నలుగురు కామారెడ్డి జిల్లాకు వచ్చారు. 14 మంది ఎస్సైలు ఇతర జోన్ పరిధిలోకి బదిలీపై వెళ్లగా, 16 మంది కామారెడ్డి జిల్లాకు వచ్చారు. వైద్య, ఆరోగ్యం, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్, అటవీ శాఖ, పశు సంవర్ధక శాఖ, ఉన్నత విద్య, గ్రామీణాభివృద్ధి, వెనుకబడిన తరగతులు, రవాణా, మున్సిపల్, రెవెన్యూ , ఎక్సైజ్ తదితర శాఖల్లో బదిలీల ప్రక్రియ చేపట్టారు.
కొత్త జోనల్ విధానంతో జిల్లాకు ప్రయోజనం
కొత్త జోనల్ విధానంతో కామారెడ్డి జిల్లాకు ఇప్పటికే ప్రయోజనం చేకూరగా కొత్త ఉద్యోగాల ప్రకటనతో నియామక ప్రక్రియ చేపడితే మరింత మంది ఉద్యోగులు జిల్లాకు రానున్నారు. విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తీసుకువచ్చిన 317జీవోతో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహించగా, ఉపాధ్యాయుల కొరత తీరింది. దీంతోపాటు విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి. కామారెడ్డి జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాకు 380 మంది ఉపాధ్యాయులు వెళ్లగా, నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాకు 698 మంది ఉపాధ్యాయులు బదిలీపై వచ్చారు. జిల్లాలోని గిరిజన మారుమూల ప్రాంతమైన గాంధారి మండలానికి అత్యధికంగా 85మంది ఉపాధ్యాయులు బదిలీపై వచ్చారు. ఇతర జిల్లాల నుంచి 30మంది ఉపాధ్యాయులు రాగా, ఇతర జిల్లాలకు 33 మంది బదిలీ అయ్యారు. కొత్తగా నియామకాలు చేపడితే ఉపాధ్యాయుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖాధికారులు భావిస్తున్నారు.
95శాతం ఉద్యోగాలు స్థానికులకే..
కొత్త ఉద్యోగాల భర్తీతో ప్రస్తుత ఉద్యోగులపై అదనపు భారం, ఒత్తిడి తగ్గుతుంది. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కడం.. ఇది నిరుద్యోగులకు చాలా మంచి అవకాశం. మన ఉద్యోగాలు మన పిల్లలకే దక్కడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రకటన యువతలో కొత్త జోష్ నింపుతున్నది.
-నరాల వెంకట్ రెడ్డి , టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కామారెడ్డి
నిరుద్యోగులు మరిచిపోలేని రోజు
కొత్త జోనల్ విధానంతో ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించింది. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా 80వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫై చేసి కొత్త శకానికి నాంది పలికారు. అసెంబ్లీ వేదికగా ఉద్యోగ ప్రకటన చేసిన బుధవారం నిరుద్యోగులు మరిచిపోలేని రోజు అవుతుంది.
– బి. సాయిలు, టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి జిల్లా