ఆర్మూర్, మార్చి 7 : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై చేపూర్ క్రాసింగ్ వద్ద సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మిర్ధాపల్లి గ్రామానికి చెందిన ఆరే రాము (25), జ్ఞానేశ్ గౌడ్ (23), చరణ్‌గౌడ్ ముగ్గురు స్నేహితులు. రాముకు పని ఉండడంతో ఆదివారం కారులో నిర్మల్‌కు వెళ్లారు. పని పూర్తి చేసుకుని ఆదివారం అర్ధరాత్రి తిరుగుపయనమ య్యారు. అతివేగంతో రావడంతో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాము అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. జ్ఞానేశ్ గౌడ్, చరణ్గౌడ్ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ జ్ఞానేశ్ గౌడ్ సైతం చనిపోయాడు. రాము డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
జ్ఞానేశ్ గౌడ్ ఎలక్ట్రీషియన్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.