కమ్మర్పల్లి, మార్చి 7 : ఎక్కడైనా పెండ్లి తంతు అనగా పురోహితుడు కనిపిస్తాడు. కనీసం సినామాల్లోనైనా ఓం మాంగల్యం తంతునానేనా అని ఆడ వాళ్లు పెండ్లి చేసే కార్యక్రమాలు కనిపించవు. కానీ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల చౌట్పల్లి గ్రామ ఆడ పడుచులు మాత్రం బోలెడన్నీ పెండ్లిలు, శుభ కార్యాలు చేస్తుంటారు. ప్రణవేశ్వరి,రాజేశ్వరి,భువనేశ్వరి,జ్ఞానేశ్వరి, ఈ అక్కా చెల్లెండ్లు అక్షర జ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వారందరూ వందలాది మంది కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగులు కన్నా పెండ్లిళ్లు, శుభ కార్యాలకు మహిళా పురోహితులుగా బాగా తెలుసు.
కమ్మర్పల్లి, భీమ్గల్, మోర్తాడ్, ఆర్మూర్ ప్రాంతాల్లో తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే పౌరోహిత్య కార్యక్రమాలు చేస్తున్నారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన కాశీరాం జోషికి నలుగురు కూ తుళ్లు. మగ సంతానం లేదనే దిగులు ఆయనకు లేదు.తనకున్న 12 గ్రామాల పౌరోహిత్య హక్కును కొనసాగించే వారెవ్వరు అనే ప్రశ్నే ఆయనకు కలుగలేదు.ఎందుకంటే తన కుమార్తెలే తన పౌరోహిత్య హక్కుకు వారసులనుకున్నాడు. తన కుమార్తెలకు పౌరోహిత్య హక్కులను, పాండిత్యాన్ని నేర్పించాడు.