ఖలీల్‌వాడి, మే 9 : ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. మొత్తం 55 ఫిర్యాదులు అందగా, వాటిని పరిశీలించిన కలెక్టర్.. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు శాఖల వారీగా ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. మొక్కలను నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించి బ్లాక్‌ల వారీగా నివేదిక అందించాలన్నారు.
యువతి ఆత్మహత్యాయత్నం
తనను మంత్రగత్తె అంటూ నామ్‌దేవ్ అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని నగరంలోని వర్ని చౌరస్తాకు చెందిన నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు ఆమెను హుటాహుటిన దవాఖానకు తరలించారు. తనను ఇద్దరు వేధిస్తున్నారని నాగలక్ష్మి సూసైడ్ నోట్ రాసిందని పోలీసులు తెలిపారు.