మాక్లూర్, అక్టోబర్ 30: యాసంగిలోనూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రమైన మాక్లూర్‌లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు 17శాతం తేమ వచ్చేలా చూసుకోవాలని, చెన్ని పడితే నష్టపోయే అవకాశం ఉండదన్నారు. మండలంలో గతంలో 18 కొనుగోలు కేంద్రాలు ఉండగా ఈసారి 22 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో నాలుగు కేంద్రాలను ఐకేపీ సంఘాలకు కేటాయించామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు దేశంలో ఎక్కడా లేవని, కేవలం మన రాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతు, మహిళా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే కమిషన్‌తో మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదుగుతారని అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారంగా రెండో స్థానంలో నిలిచిందన్నారు.యాసంగిలో కూడా ధాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్,సర్పంచ్‌లు అశోక్‌రావు, గంగాధర్‌నాయక్, ఎంపీటీసీలు వెంకటేశ్వర్రావు, మీరా బాయి, కో-ఆప్షన్ సభ్యుడు హైమద్, ఐకేపీ ఏపీఎం అనిల్‌కుమార్, సీసీలు గంగాబాబు, శ్రీధర్‌రెడ్డి, నాయకులు మనోహర్‌రావు, నర్సాగౌడ్, మర్ల దత్తు, నారాయణ,తాజ్,పాషా, ప్రకాశ్, ఒడ్డెన్న, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.