భీమ్‌గల్/ వేల్పూర్, అక్టోబర్ 29: సీఎం కేసీఆర్ తీసుకుంటున్న రైతు ప్రయోజన కార్యక్రమాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసన సభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వేల్పూర్ మండలంలోని లక్కోర, భీమ్‌గల్ మండలంలోని సికింద్రాపూర్ గ్రామాల్లో రూ.ఏడు కోట్ల చొప్పున మొత్తం రూ. 14 కోట్లతో చేపట్టిన 20వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సికింద్రాపూర్‌లో రూ. 24లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మీడియాతో మాట్లాడారు. గడిచిన ఏడేండ్లలో గతంలో కన్నా ధాన్యం ఐదురేట్లు ఎక్కువగా సాగువుతున్నదని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా బీడుభూమి లేదన్నారు. సమైక్యపాలనలో నియోజక వర్గంలో కేవలం ఐదు వేల మెట్రిక్ టన్నుల గోడౌన్లను మాత్రమే నిర్మించారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారంతో 57, 250 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లను నిర్మించినట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా సాగునీటికి ఢోకాలేకుండా పోయిందన్నారు. చెక్‌డ్యాములు, చెరువులు, పూడికతీత ద్వారా భూగర్భజలాలు పెరగడంతో ఎకరం కూడా బీడు లేకుండా సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, గ్రామాల్లోనే పంటకొనుగోళ్లు తదితర పథకాలు, కార్యక్రమాలతో పంట దిగుబడి గతంలో కన్నా ఐదు రేట్లు పెరిగిందని చెప్పారు. పండించిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేసుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గోడౌన్లను నిర్మిస్తున్నారని తెలిపారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 11 గోడౌన్లలో ఇప్పటికే తొమ్మిది పూర్తయినట్లు చెప్పారు. వీటిలో 57,250 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చన్నారు. వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, రెంజర్ల, భీమ్‌గల్, కిసానగర్, ఏర్గట్ల, బాల్కొండ లో ఇప్పటికే గోడౌన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
అభివృద్ధి కనబడడంలేదా?
ప్రతిపక్షాల తీరుపై మంత్రి వేముల మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్ష నాయకుల కళ్లకు కనబడడంలేదా అని ప్రశ్నించారు. చూస్తూ కూడా చూడనట్లు నటిస్తున్నారని, ఏదో విమర్శించాలని విమర్శిస్తే ఎవరూ ఏమి చేయలేరన్నారు. ప్రతిపక్షాలు ఎన్నిరకాలుగా విమర్శలు చేసినా పనిచేసుకుంటూ పోవాలని కేసీఆర్ ఎప్పుడు తమకు చెబుతారన్నారు. పనిచేసే వారిని ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకుంటారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక జరిగిన అభివృద్ధిని రైతులు గమనించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు, అడిగిన వెంటనే గోదాములను మంజూరుచేసిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాల్లో ఆర్డీవో శ్రీనివాసులు, డీసీసీబీ వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డి, ఎంపీపీలు భీమ జమున, మహేశ్, జడ్పీటీసీలు అల్లకొండ భారతి, చౌట్పల్లి రవి, తహసీల్దార్లు సతీశ్‌రెడ్డి, రాజేందర్, సర్పంచులు వంశీ, సంధ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నోముల రవీందర్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.