వేల్పూర్, అక్టోబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. అటువంటి నాయకుడిపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదిలేదన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన బీఎస్పీ సీనియర్ నాయకుడు రంజిత్‌తోపాటు 150 మంది యువకులు శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించారన్నారు. ఆయన మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవో ఆ పార్టీల నాయకులు సమాధానం చెప్పాలన్నారు. బాండ్ పేపర్‌తో రైతులను మోసం చేసిన అర్వింద్, బీజేపీ నాయకులు హిందూత్వం పేరిట రెచ్చగొడుతూ ఉంటారని మండి పడ్డారు. కేసీఆర్ కన్నా గొప్ప హిందువు ఎవరూ లేరన్నారు. ఎంతో గొప్పగా రాతితో నిర్మిస్తున్న యాదాద్రి ఆలయం వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజక వర్గంలో కొత్తగా 31 ఆలయాలు నిర్మించామన్నారు. మోదీని అడిగి బాల్కొండలో 62 ఆలయాలు నిర్మించాలని సవాల్ విసిరారు. విద్యుత్ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం నిబంధన విధించినా తెలంగాణ కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదన్నారు. పొరుగురాష్ట్రం ఆంధ్రాలో ఇప్పటికే మీటర్లు బిగించే కార్యక్రమం మొదలైందని తెలిపారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే, తదితర ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందన్నారు. అందులో పనిచేసే ఉద్యోగులు రోడ్ల మీద పడుతున్నారన్నారు. పింఛన్, ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండి పడ్డారు. పింఛన్ పథకంలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న రూ.8 వేల కోట్లలో కేంద్రం ఇచ్చేది కేవలం రూ.200 కోట్లు మాత్రమేనన్నారు. బీజేపీ బండి సంజయ్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. కేసీఆర్‌తోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అనంతరం పార్టీలో చేరిన యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి అండగా ఉంటానన్నారు.అంతకు ముందు యువకులు వేల్పూర్ ఎక్స్ రోడ్డు నుంచి మంత్రి నివాసం వరకు బైక్ ర్యాలీగా తరలివచ్చారు.