మార్కెట్ తీరుతెన్నుల్ని అంచనా వేస్తూ.. రైతులకు అవగాహన కల్పిస్తూ పంటమార్పిడిపై రాష్ట్రప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నది. ఈ ఏడాది కూడా వరికి బదులుగా పత్తిని సాగు చేయాలని ప్రభుత్వం సూచించినప్పటికీ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనూహ్యంగా పత్తి సాగువిస్తీర్ణం గతం కన్నా తగ్గింది. గత ఏడాది సుమారు 5000 ఎకరాల్లో పత్తి సాగవగా, ఈ వానకాలం సీజన్లో అది సగానికి తగ్గింది. జలవనరులు పుష్కలంగా ఉండడంతో రైతాంగం ప్రభుత్వ మాటను చెవినపెట్టకుండా వరి వైపే ప్రధానంగా మొగ్గు చూపింది. అయితే మార్కెట్లో పత్తి దిగుబడి తక్కువగా రావడంతో డిమాండ్ హెచ్చింది. ప్రభుత్వ సలహా పాటించి పంట మార్పిడి చేసిన రైతులకు కాలం కలిసివచ్చింది. 2021-22లో కేంద్రం సవరించిన మద్దతు ధర రూ.5726గా ఉండగా.. అందుకు భిన్నంగా ప్రైవేటు కొనుగోళ్లలో పత్తికి రికార్డుస్థాయి ధర దక్కుతున్నది. వ్యాపారులు ఏకంగా క్వింటాలుకు రూ.8వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తుండడంతో తెల్లబంగారం సాగుచేసిన రైతులు సంబురపడిపోతున్నారు.
నిజామాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తూ పంట మార్పిడి చేయాలని సూచనలు చేస్తున్నది. రైతులకు అధిక లాభాలు అందించేలా వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రయత్నాలు క్షేత్ర స్థాయిలో అంతగా ఫలించడం లేదు. రైతులు మూస పద్ధతిలో వరి పంటల సాగుకే ప్రాధాన్యం ఇస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్న ప్రగతి రావడం లేదు. సంప్రదాయ పంటలను సాగు చేయడం ద్వారా మార్కెట్లో సరైన ధర పొందలేక రైతులు కుదేలవుతున్నారు. ఈ దుస్థితిని మార్చేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని రెండేండ్లుగా ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి రైతులకు చైతన్యం కల్పించింది. వరికి బదులుగా పత్తిని సాగు చేయాలని విస్తృతంగా అవగాహన కల్పించినప్పటికీ పుష్కలంగా జల వనరుల మూలంగా గతం కన్నా మరింతగా పత్తి సాగు పతనమవ్వడం కనిపించింది. కానిప్పుడు బహిరంగ మార్కెట్లో సీజన్ ముగింపు నాటికి పత్తి క్వింటాలుకు రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. పంట మార్పిడి చేసిన రైతులకు అధికల లాభాలు వస్తుండగా… ప్రభుత్వ సూచన పట్టించుకోని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనూహ్యంగా తగ్గిన పత్తి సాగు..
పత్తి సేకరణకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా మద్నూర్లోని జిన్నింగ్ మిల్లులోనే కేంద్రం ఏర్పాటు చేసి పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. రైతులకు అధిక లాభాలు దక్కాలంటే కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల చెంతనే కేంద్రాలు ఏర్పాటయ్యేలా కృషి చేయాలి. సరిహద్దుల్లో కాటన్ కొనుగోలు కేంద్రాలను నెలకొల్పితే సుదూర ప్రాంతానికి వెళ్లి పంట అమ్ముకోవాలంటే సామాన్య రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు వినతులు సమర్పించినప్పటికీ కేంద్రం కనీసం పట్టించుకోవడం లేదు. రైతు వ్యతిరేక నిర్ణయాలతో బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. రైతుల మేలు కోసం ఇసుమంతైనా ఆలోచించడం లేదు. పైగా తెలంగాణ ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తూ కర్షకులకు కన్నీళ్లు తెప్పించే చర్యలకు మోదీ సర్కారు ప్రయత్నిస్తుండడంపై రైతన్నలు గుర్రుమంటున్నారు.
సీసీఐ నిర్లక్ష్యం వీడితే..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పత్తి సాగు ఈ వానకాలం సీజన్లో అనూహ్యంగా తగ్గింది. భారీ వర్షాలు, చెరువుల్లో పుష్కలంగా నీళ్లుండడంతో అంతా వరి వైపే దృష్టి పెట్టారు. దీంతో మార్కెట్లో పత్తి దిగుబడులు తక్కువగా వస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ధర సైతం అంతకంతకూ పెరగడంతో పంట మార్పిడి చేసిన రైతులకు కాలం కలిసి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో 2021 వానకాలంలో 3లక్షల 52వేల 52వేల 594 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. సాధారణ వరి విస్తీర్ణం 2లక్షల 86వేల ఎకరాలు కాగా 123 శాతం మేర వరి పంటను రైతులు సాగు చేయడం విశేషం. వ్యవసాయాధికారుల అంచనాలకు విరుద్ధంగా పెసర్లు 443 ఎకరాల్లో, మినుములు 565 ఎకరాల్లో, కంది 6219 ఎకరాల్లో, 26,657 ఎకరాల్లో మక్కజొన్న సాగయ్యాయి. సోయాబీన్ 63వేల 842 ఎకరాల్లో, పత్తి 2,546 ఎకరాల్లోనే సాగుకు నోచుకుంది. గతేడాది 5వేల ఎకరాల్లో పత్తి సాగవ్వగా ఈసారి పత్తి సాగు 50శాతానికి పడి పోవడం కనిపించింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2021 వానకాలం సీజన్లో పత్తి పంట గతం కన్నా తక్కువ విస్తీర్ణంలో సాగుకు నోచుకుంది. ఈ సీజన్లో పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 42,899 ఎకరాలు కాగా 1,14,857 ఎకరాల్లో పత్తిని సాగు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. అందుకు భిన్నంగా కేవలం 34,765 ఎకరాల్లోనే పత్తి సాగైంది.
మద్దతు ధర దాటుకుని..
2020-21లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆయా పంటలకు కనీస మద్ధతు ధరలో పత్తికి క్వింటాలుకు రూ.5515 మాత్రమే ఉంది. 2021-22లో రివైజ్డ్ ధరల్లో క్వింటాలు పత్తికి కనీస మద్దతు ధర రూ.5726గా నిర్ణయించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో రైతులకు దక్కే మద్దతు ధర రూ.5726 మాత్రమే ఉండగా అందుకు భిన్నంగా ప్రైవేటు కొనుగోళ్లలో రికార్డు స్థాయిలో పత్తికి డిమాండ్ దక్కుతున్నది. ప్రైవేటు వ్యాపారులు రాష్ట్రంలో పండించిన పత్తిని ఏకంగా రూ.8వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో క్వింటాలు పత్తి రూ.7800లకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు అదే స్థాయి ధర నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ కనిపించబోతున్నది. ఉమ్మడి జిల్లాలో జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో అత్యధికంగా పత్తిని సాగు చేస్తున్నారు. ఇప్పుడు పత్తి పంట వేసిన రైతులకు మంచి రోజులు కనిపిస్తున్నాయి. పత్తి పంట సాగు చేసిన రైతుల వద్దకే ప్రైవేటు వ్యాపారులు వచ్చి పంటను సేకరిస్తున్నట్లు తెలిసింది. భారీ ధరకు పత్తి అమ్ముడవుతుండడంతో రైతుల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం చెప్పినట్లుగానే పత్తి పంటను సాగు చేసి ఉంటే అధిక లాభాలు వచ్చేవని వారంతా నిట్టూర్చడం కనిపిస్తోంది.
ధర ఎక్కువగా ఉండాలి
పత్తి పంటకు ధర ఎక్కువగా ఉండాలి. ప్రస్తుత సంవత్సరం ధర ఎనిమిది వేలు ఉన్నప్పటికీ మరో వెయ్యి రూపాయలు అధికంగా ఉంటే గిట్టుబాటు ఉంటుంది. ఎకరానికి సుమారు ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి ఒకే పంట అయినందున గిట్టుబాటు కావాలంటే ధర ఇంకొంచెం ఎక్కువగా ఉండాలి.
-సిద్రామ్, పత్తి రైతు, బారాలి
పంటలు బాగున్నాయి..
ఈ సంవత్సరం పంటలు బాగున్నాయి. పత్తి పంటకు ధర బాగానే ఉంది. క్వింటాలుకు ఎనిమిది వేల రూపాయల ధర పలుకుతున్నది. పత్తి పంట దిగుబడి ఆరు నుంచి ఏడు క్వింటాళ్లు వస్తుంది. పంట పెట్టుబడికి నాకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందింది. ప్రతి సంవత్సరం పత్తి పంటను సాగుచేస్త్తూ వస్తున్నాను. పత్తి పంట మాకు కలిసి వస్తుందని నమ్మకముంది.
-భరత్, పత్తి రైతు, మద్నూర్