ఇందూరు, అక్టోబర్ 29 : నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా నిషేధిత గుట్కాను పోలీసులు ఈనెల 26వ తేదీన స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సీపీ కార్తికేయ ఆదేశాల మేరకు 26వ తేదీన న్యాల్కల్ చౌరస్తాలో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ గురునాథ్, 5వ టౌన్ ఎస్‌హెచ్‌వో రాజేశ్వర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా వస్తు న్న డీసీఎంను ఆపి తనిఖీ చేయగా భారీగా గుట్కా సంచులు లభ్యమయ్యాయి. కోళ్ల దాణా సంచుల కింద మొత్తం 40 సంచుల్లో గుట్కా ప్యాకెట్లు గు ర్తించారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందన్నారు. డీసీఎం నడుపుతున్న డ్రైవర్ మహ్మద్ సల్మాన్‌ను అరెస్టు చేశారు. గుట్కా సంచులను కర్ణాటక హుమ్నాబాద్, బీదర్ జిల్లా నుంచి బోధన్ మీదుగా నాందెడ్ వైపు తీసుకుని వెళ్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. గుట్కా వ్యాపారులైన రఫత్, ఇబ్రహీంలను విచారించగా డీసీఎం వాహన యజమాని ముస్తఫాతో గుట్కా వ్యాపారం చేస్తూ కర్ణాటకలోని హుమ్నాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. గుట్కా లోడ్ కామారెడ్డి వరకు వచ్చేలోపు రఫత్ అతనికి సంబంధించి సేల్స్‌మెన్ అయిన మహ్మద్ అల్తాఫ్ (శివాజీనగర్,) షేక్ గౌస్ (ఆటోనగర్), సద్దాం (బాన్సువాడ), మాజీద్ (సాలూరా), రాజు (మెట్పల్లి), రవి (డొంకేశ్వర్), నాగేశ్ (అంకాపూర్)లకు తెలియజేయగానే వారు ఆటోలు, కార్లు తీసుకుని ధర్మపురి హిల్స్ ఏరియాకు వచ్చి సిద్ధంగా ఉంటారన్నారు. లోడ్ రాగానే ఎవరికి ఎంత అవసరముంటే అంత తీసుకుని వెళ్లిపోతారని తెలిపారు. మహ్మద్ అల్తాఫ్ ఇంటిలో సోదా చేయగా మరిన్ని గుట్కా సంచులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీటి విలువ రూ.3లక్షల 50వేల విలువ వరకు ఉంటుందన్నారు. ప్రస్తుతం షేక్ రఫత్, మహ్మద్ ఇబ్రహీం, మహ్మద్ సల్మాన్ (ఐచర్ వ్యాన్‌డ్రైవర్), మహ్మద్ అల్తాఫ్, షేక్ గౌస్ కస్టడీలో ఉన్నారని తెలిపారు. షేక్ రఫత్‌ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు తెలిపారు.