మెండోరా, అక్టోబర్ 27 : ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది. ఈ సీజన్లో ఎగువ నుంచి మొత్తం 669 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా, ప్రాజెక్టు 1983లో పూర్తిస్థాయి నిర్మాణం అనంతరం ఇంత భారీస్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి. 1990 వానకాలంలో 645 టీఎంసీల వరద వచ్చి చేరగా, 531 టీఎంసీల మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేశారు. ఈ సీజన్లో ప్రాజెక్ట్‌లోకి 669 టీఎంసీల ఇన్‌ఫ్లో రావడంతో, 597 టీఎంసీల మిగులు జలాలను దిగువకు విడుదల చేశారు.
ప్రస్తుత సీజన్ జూన్ 3వ తేదీ నుంచి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద ప్రారంభమయ్యింది. నెలాఖరులోగా 10 టీఎంసీలు, జూలై నెలలో 109 టీఎంసీల వరద వచ్చిచేరింది. దీంతో మూడు రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆగస్టులో 31 టీఎంసీలు, సెప్టెంబర్‌లో 295 టీఎంసీలు, అక్టోబర్ నెలలో అత్యధికంగా 223 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చింది. జూలై 22వ తేదీన ఎగువ నుంచి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి మిగులు జలాలను విడుదల చేశారు. జూలై నెలలో 42 టీఎంసీలు, ఆగస్టులో 5 టీఎంసీలు, సెప్టెంబర్‌లో 279 టీఎంసీలు, అక్టోబర్‌లో 186 టీఎంసీల వరద నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు చరిత్రలో ఇంతపెద్ద మొత్తం ఇన్‌ఫ్లో రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.
రేపు బాబ్లీ ప్రాజెక్టు గేట్ల మూసివేత
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన 80 కిలో మీటర్ల దూరంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్ట్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రాజెక్టు 14 గేట్లను జూలై 1 నుంచి అక్టోబర్ 28 తేదీ వరకు పూర్తిగా తెరిచి ఉంచాలి. అక్టోబర్ 29న గేట్లను త్రిసభ్య కమిటీ (ఎస్సారెస్పీ, నాందెడ్ నీటిపారుదల శాఖ, సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో మూసివేస్తారు. కానీ అధికారుల అంచనా ప్రకారం బాబ్లీ గేట్లు మూసినప్పటికీ ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తున్నది. దీంతో తిరిగి గేట్లు తెరిచే అవకాశం వుందని అంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ గేట్లను మూసివేసేందుకు శుక్రవారం ఉదయం ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ చక్రపాణి, డీఈ నరేశ్, ఏఈఈలు వంశీ, రవి ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. తిరిగి మార్చి 1వ తేదీన తాగునీటి అవసరాల కోసం బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి దిగువ ఎస్సారెస్పీలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేస్తారు.
తగ్గిన ఇన్‌ఫ్లో ..
ఎగువ నుంచి ఎస్సారెస్పీకి 8,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నదని ఏఈఈ రవి తెలిపారు. ప్రస్తుతం వరద గేట్లను మూసివేసినట్లు చెప్పారు. కాకతీయ కాలువకు 5 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2500, సరస్వతీ కాలువకు 800, లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతున్నదని వివరించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, బుధవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉందని ఏఈఈ తెలిపారు.