బోధన్, అక్టోబర్ 27 : రాష్ట్ర సాధన కోసం నాడు ఉవ్వెత్తున ఎగిసిన మలిదశ ఉద్యమంలో బోధన్ కేంద్రంగా జరిగిన వివిధ పోరాటాలతో పాటు సుదీర్ఘకాలం కొనసాగిన దీక్షలు జిల్లాలోనే కాదు.. తెలంగాణాలోనే ఓ మహత్తర ఘట్టంగా నిలిచాయి. ఉద్యమనేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్యమకాలంలోనూ, ఆ తర్వాత అనేకసార్లు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో బోధన్‌లో జరిగిన తెలంగాణ నిరాహారదీక్షలను ప్రస్తావించేవారు. దీన్నిబట్టి రాష్ట్ర ఉద్యమంలో బోధన్ నిరాహారదీక్షల ప్రాధాన్యత అర్థమవుతుంది. రాష్ట్ర ఏర్పాటుకోసం బోధన్ పట్టణంలో ఏదో ఒక నెలో.. రెండు నెలలో కాదు.. ఏకంగా 1519 రోజుల పాటు బోధన్ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. మెదక్ జిల్లా సిద్ధిపేట్‌లో జరిగిన నిరాహారదీక్షల రోజులతో సమానంగా బోధన్‌లో తెలంగాణ సిద్ధించేవరకు నిరాహారదీక్షలు కొనసాగడం గమనార్హం. ఆదిలాబాద్, హైదరాబాద్‌లోని బోడుప్పల్లో సుదీర్ఘకాలంపాటు నిరాహారదీక్షలు జరిగినప్పటికీ, అక్కడ బోధన్‌లో జరిగినన్ని రోజులు దీక్షలు జరగలేదు.. ఈ కారణంగానే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు మరో తెలంగాణ ఉద్యమనేత హరీశ్‌రావు బోధన్ దీక్షల గురించి ఇతర ప్రాంతాల్లో పలుమార్లు ప్రస్తావించారు.
‘తెలంగాణ అచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అన్న నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్‌లో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో యావత్తు తెలంగాణతోపాటు బోధన్ ప్రాంతంలోనూ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించిన దరిమిలా కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఫలితంగా ఆ ఏడాది నవంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆంధ్రా నాయకులు కుట్రలకు తెరలేపడం, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు అక్కడ కృత్రిమ ఉద్యమాలు నడపడంతో కేంద్ర ప్రభుత్వం అదే నెల 25న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయంపై వెనక్కి తగ్గింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమయ్యింది. బోధన్ ప్రాంతంలోనూ ప్రత్యేక తెలంగాణ నినాదంతో తెలంగాణవాదులు, ప్రజలు ఉద్యమబాట పట్టారు. అప్పట్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్న పి.గోపాల్‌రెడ్డి కన్వీనర్‌గా బోధన్ జేఏసీ ఏర్పాటయ్యింది. 2009 డిసెంబర్ 25న ఈ జేఏసీ ఏర్పాటు కాగా, అదే నెల 28 నుంచి బోధన్ పట్టణంలో తెలంగాణ కోసం నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలు ప్రారంభమైన మరునాడే తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ప్రస్తుతం శాసనమండలి అధ్యక్షురాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత దీక్షా శిబిరాన్ని నిర్వహించడమే కాకుండా పెద్ద ఎత్తున బహిరంగసభలో మాట్లాడారు. 2009 డిసెంబర్ 28న బోధన్ పట్టణంలోప్రారంభమైన దీక్షలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరాయంగా సాగాయి. బోధన్‌లో 2009 డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ దీక్షలు.. 1519 రోజులపాటు.. అనగా 4 సంవత్సరాల 17 రోజుల పాటు కొనసాగి 2014 ఫిబ్రవరి 23న ముగిశాయి. ఈ కాలమంతటా బోధన్‌లో నిరాహారదీక్షలే కాకుండా తెలంగాణ ఆకాంక్షను చాటుతూ అనేక పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాలన్నీ ఒక వినూత్నంగా జరుగుతూ.. తెలంగాణవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటాలకు స్ఫూర్తిని ఇచ్చాయి.
నిరాహారదీక్షల సభలకు రెండుసార్లు వచ్చిన కేసీఆర్
బోధన్ పట్టణం కేంద్రంగా కొనసాగిన దీక్షలు ఉద్యమ నేత కేసీఆర్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న ఈ నిరాహారదీక్షల విషయమై ఆయన ఎప్పటికప్పుడు బోధన్ జేఏసీ కన్వీనర్ గోపాల్రెడ్డితోనూ, జిల్లాలోని టీఆర్ఎస్ శ్రేణులతోనూ మాట్లాడేవారు. బోధన్‌లో జరుగుతున్న నిరాహార దీక్షలకు ఏడాది పూర్తయిన సందర్భంగా 2010 డిసెంబర్ 27న కేసీఆర్ బోధన్‌కు వచ్చారు. ఆయన వెంట అప్పట్లో బీజేపీ నాయకుడిగా ఉన్న విద్యాసాగర్‌రావు కూడా వచ్చారు. ఆ తర్వాత నిరాహారదీక్షలకు రెండో సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూడా 2011 డిసెంబర్ 28న బోధన్‌కు సీఎం కేసీఆర్ వచ్చారు. ఆ రోజున బోధన్ నిరాహార దీక్ష శిబిరంలో 731 రోజులకు గుర్తుగా 731 మంది మహిళలు నిరాహారదీక్షలో కూర్చున్నారు. ఈ అపురూప సన్నివేశాన్ని కేసీఆర్ స్వయంగా వీక్షించమే కాకుండా ఆ మహిళలకు తెలంగాణ ఉద్యమ నాయకులతో కలిసి పండ్ల రసం అందించి వారితో ఆ రోజున జరిగిన నిరాహారదీక్షలను విరమింపజేశారు. బోధన్ నిరాహారదీక్షలకు 500 రోజులు పూర్తయిన సందర్భంలో తెలంగాణ ఉద్యమనేత హరీశ్‌రావు బోధన్‌కు వచ్చి బహిరంగసభలో మాట్లాడారు.
బోధన్ దీక్షలకు కేసీఆర్ స్ఫూర్తిని అందించారు..
బోధన్‌లో తెలంగాణ సాధన కోసం జరిగిన 1519 రోజుల నిరాహార దీక్షలకు నాటి తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ ఎంతో స్ఫూర్తిని అం దించారు. బోధన్ జేఏసీ కన్వీనర్‌గా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడడం జరిగే ది. బోధన్‌లో నిరాహారదీక్షల పట్ల ఆయన ప్రత్యేకంగా ఆసక్తిని చూపేవారు. అందుకు బోధన్ దీక్షలకు మొదటి సంవత్సరం, రెం డవ సంవత్సరం పూర్తయిన సందర్భాల్లో కేసీఆర్ స్వయంగా బోధన్‌కు వచ్చారు. జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన పార్టీల నాయకులతో పాటు ఆయన నాటి సభల్లో పాల్గొన్నారు. కేసీఆర్ విలక్షణమైన వ్యక్తిత్వంతో పాటు ఆయన ప్రసంగాలు బోధన్ ప్రాం తంలో తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊతం ఇ చ్చాయి. నాటి సభల్లో బోధన్ తెలంగాణ బిడ్డలకు శిర స్సు వంచి నమస్కరిస్తున్నాంటూ చేసిన ప్రసంగాలను ఇప్పటికీ మర్చిపోలేం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బోధన్ నిరాహారదీక్షలను, నా పేరును కేసీఆర్ తెలంగాణ ఉద్యమకాలంలో ప్రస్తావించడం నాకెంతో గర్వకారణం..
బోధన్‌లో తెలంగాణ బిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..
బోధన్ తెలంగాణ నిరాహారదీక్షలకు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పూర్తయిన సందర్భాల్లో టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ బోధన్ పట్టణానికి వచ్చారు. నిరాహారదీక్షలకు సంఘీభావం తెలిపేందుకు ప్రత్యేకంగా వచ్చిన ఆయన.. రెండు సందర్భాల్లోనూ బోధన్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగసభల్లో మాట్లాడారు. తన ఉద్వేగపూరిత ప్రసంగాలతో బోధన్ నిరాహారదీక్షలకు స్ఫూర్తిని ఇచ్చారు. ఈ సందర్భంగా బోధన్ తెలంగాణ బిడ్డలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బోధన్ జేఏసీ కన్వీనర్ పి.గోపాల్‌రెడ్డితో పాటు జేఏసీ నిర్వాహకులకు, తెలంగాణ ఉద్యమకారులను అభినందించారు. ‘బోధన్‌లో తెలంగాణ కోసం నిరాహారదీక్షలు చేస్తున్న బోధన్ తెలంగాణ బిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..’, ‘బోధన్ తెలంగాణ బిడ్డలకు నా సెల్యూట్’ అంటూ నాటి సభల్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇప్పటికీ బోధన్ ప్రజలు గుర్తుచేసుకుంటుంటారు.. తెలంగాణ ఉద్యమ పార్టీ రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంలో.. నాడు తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ బోధన్‌కు వచ్చిన సందర్భాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.