కేంద్ర ప్రభుత్వం పెంచుతూ వస్తున్న ఇంధన ధరలతో ప్రతి ఇంటా మంటలు చెలరేగుతున్నాయి. రూ.100 దాటుకుని పరుగులు తీస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. ప్రత్యక్షంగా వాహనదారులపై ఇంధన భారం పడుతుండగా.. పరోక్షంగా వాటి ప్రభావం అందరి జేబులకు చిల్లు పెడుతున్నది. చమురు ధరల కారణంగా నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. రెండునెలల క్రితం వరకు రూ.10 పలికిన కిలో టమాట ధర ప్రస్తుతం రూ.30 నుంచి దిగిరావడం లేదు. ఆలుగడ్డ మొదలు ఆయిల్ ప్యాకెట్ల వరకు అన్నింటి రేట్లలోనూ పెరుగుదల సగటుజీవిని భయపెడుతున్నది. రవాణా వ్యయం పెరుగుతుండడంతోనే సరుకులు, కూరగాయల ధరలు కూడా పెంచాల్సి వస్తున్నదని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు చమురు ధరలతో అన్నదాతలు సైతం కుదేలవుతున్నారు. ట్రాక్టర్లు, యంత్రాల అద్దెలు భారీగా పెరిగిపోయాయి.
గంగాధర్ ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగి. నెలవారీ జీతం రూ.18వేలు. ఇంటి కిరాయి, కుటుంబ పోషణ, స్కూల్ పిల్లలకు ఫీజులు, ఇతరత్ర ఖర్చులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఫీల్డ్‌వర్క్ పేరిట టూర్లకు వెళ్తే నెలకు రూ.2వేల ఖర్చు అదనం. ఏడాదిక్రితం వరకు పెట్రోల్ ఖర్చు రూ.2వేలలోపు మాత్రమే అయ్యేది. పెరిగిన ధరలతో అది రూ.3,500కి చేరింది. పనికోసం ద్విచక్రవాహనం బయటకు తీయాల్సిందే. తీస్తే.. పెట్రోల్ బాదుడు ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఆదాయంలో వృద్ధి లేక, ఖర్చు మాత్రం గణనీయంగా పెరగడంతో గంగాధర్ కకావికలం అవుతున్నాడు.
నిజామాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇలా చెప్పుకుంటూ పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజల జీవితాలు ఆగమాగం అవుతున్నాయి. దేశ ప్రజలపై కనీసం కనికరం లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎడాపెడా పెంచేస్తోన్న ఇంధన ధరలు అనేక వర్గాలను దెబ్బతీస్తోంది. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే లక్షలాది మంది రోడ్డున పడుతున్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే వారంతా పెట్రోల్ ధరలతో ఆందోళన చెందుతున్నారు. కుటుంబ పోషణకే వచ్చే జీతం సరిపోతున్న దుస్థితిలో పెరిగిన ఇంధన ధరలతో వాహనాన్ని బయటికి తీయాలంటే జంకాల్సి వస్తోంది. ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరల మూలంగా వాహనాలు లేని వారిపైనా తీవ్రమైన ప్రభావమే పడుతోంది. రూ.వంద దాటుకుని పరుగులు తీస్తోన్న డీజిల్ ధరతో నిత్యావసరాలు, కూరగాయలు ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. రవాణా ఖర్చులు పెరుగుతుండడంతో ఉప్పు నుంచి మొదలు పెడితే పప్పుదినుసుల వరకు ధరలు అమాంతం పెరిగాయి. రోజురోజుకు పైసా చొప్పున పెంచేస్తోన్న పెట్రోల్, డీజిల్ ధరలను చూసి సామాన్యులు ఆందోళన చెందుతుండగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం కనీసం చీమ కుట్టినట్లయినా స్పందించకపోవడంపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.
రైతులపైనా పెను ప్రభావం…
తరచూ పెరుగుతున్న చమురు ధరలతో అన్నదాతలు సైతం కుదేలవుతున్నారు. ఇది వరకు ఏడాదికి ఒకటి రెండు సార్లు పెంచినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. నిత్యావసరంగా మారిన ఇంధన ధరలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో సామాన్య ప్రజలతో పాటు అన్నదాతలకు కూడా కష్టాలు తప్పడం లేదు. వ్యవసాయం చేసుకునే వారికి పెరిగిన డీజిల్ ధరలను చూస్తే గుండె గుభేల్మంటున్నది. 2020 జూన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.49 ఉంది. ప్రస్తుతం రూ.114 చేరింది. దాదాపు రూ.40 వరకు అదనపు భారం పడుతున్నది. డీజిల్ సైతం రూ.69.15 ఉండగా ఇప్పుడు లీటర్ డీజిల్ రూ.107.06 పలుకుతోంది. డీజిల్‌పైనా దాదాపు రూ.38 పెరిగింది. ఇంతటి పెను భారంతో వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి. వరి సాగు చేసే రైతుపై ఏడాదికి ఎకరాకు అదనంగా రూ.3వేల నుంచి రూ.3,500 వరకు ఖర్చు అవుతోంది. ఇతర పంటలు సాగు చేసే వారిపై రూ.2వేల వరకు అదనపు వ్యయం వెచ్చించాల్సి వస్తోం ది. దుక్కి దున్నడం, నాట్లు వేయడం, పంట కోత, గడ్డి కట్టలు కట్టడం, మట్టి తరలింపు, పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడం ఇలా అన్నింటిపైనా పెరిగిన డీజిల్ ధర ప్రభావం చూపుతోంది. వాహన యజమానులు అద్దె పెంచుతున్నారు. గతేడాది ట్రాక్టర్ గంటకు రూ.1100 ఉండగా ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో రూ.1400 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు.
మండుతోన్న కూరగాయల ధరలు…
కూరగాయల ధరలు వంట వండకముందే మండుతున్నాయి. కొనాలంటేనే సామాన్యులకు కన్నీరు వచ్చేస్తోంది. రెండు నెలల నుంచి కూరగాయల ధరలు భగ్గు మంటున్నాయి. రెండు నెలల కిందట టమాట కిలోకు రూ.30 ఉండగా ఇప్పుడు రూ.50కి తగ్గడం లేదు. పుదీనా, కొత్తిమీర సైతం అగ్గిపిరమై కూర్చుంది. గోరు చిక్కుడు కిలోకు రూ.70, గోబీ పువ్వు కిలోకు రూ.60, పచ్చి మిర్చి కిలోకు రూ.80 దిగి రావడం లేదు. వంకాయలు, కాకర, బెండ, బీరకాయలైతే కిలోకు రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు.
క్యారెట్ ధర కిలోకు రూ.100కు చేరింది. ఉల్లిగడ్డలు కిలోకు రూ.50, ఆలుగడ్డలు కిలోకు రూ.40 తక్కువకు రావడం లేదు. అసాధారణ రీతిలో పెరిగిన కూరగాయల ధరలకు కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచేస్తున్న ఇంధన ధరలే ప్రధాన కారణం. గత సీజన్లో అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడానికి తోడుగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ధరలు రెట్టింపు అయ్యాయి. మార్కెట్లో కూరగాయల ధరల పెరుగుదలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. పెరిగిన ఖర్చులతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.
కట్టెల పొయ్యితోనే వంట
మాక్లూర్ అక్టోబర్ 27 : సిలిండర్ ధర పెరగడంతో మళ్లీ కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకునే రోజులు వచ్చాయి. నిత్యం గ్యాస్ ధరలు పెరుగడం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు కొలుకోలేని దెబ్బ. రూ. 500 ధర ఉండే సిలిండర్ వెయ్యికి చేరింది. కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల బతుకులను ఛిద్రం చేస్తున్నది.
-బూరోళ్ల లావణ్య, మాక్లూర్
పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి
పెట్రోల్ ధరలు దిన దిన గండం లా పెరుగుతున్నాయి. రూ.60-70 ఉన్న పెట్రోల్ ధర నేడు రూ.114కు చేరింది. గతంలో పెట్రోల్ రేటు ఎప్పుడో ఒకసారి పెరిగేది. పెట్రోలు రేటు పెరుగడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నూనె, చక్కెర, పప్పుల ధరలు డబుల్ కావడంతో వ్యాపారం చేయలేక పోతున్నా.
-సింగారం అశోక్, వ్యాపారి, మాక్లూర్
బేరాలు లేక ఇబ్బందులు పడుతున్నాం..
ఆటోలకు బేరాలు లేక ఇబ్బందు లు పడుతున్నాం.చాలా మంది ప్రయాణికులు ఆటో ఎక్కాలంటేనే ఆలోచిస్తున్నారు. జిల్లా కేం ద్రంలో స్టాపు స్టాపునకు రూ.10 తీసుకునేవాళ్లం. ఇప్పడు డీజిల్ రే ట్ లీటర్‌కు రూ.100 దాటడం తో రూ.20 తీసుకోవాల్సి వస్తుం ది. రోజంతా తిరిగినా రూ.500 రూపాయలు సంపాదించలేక పోతున్నాం. అవి కూడా డిజీల్కే అయిపోతున్నాయి.
-ముఖేశ్, ఆటో డ్రైవర్
రైతులపై భారం పడుతుంది
జక్రాన్‌పల్లి, అక్టోబర్ 27 : కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ పెట్రో ల్, డీజిల్ పెంచడంతో రైతులపై భారం పడుతున్నది. వరి కోతలు ప్రారంభిద్దామంటే చుక్కలు కనబడుతున్నాయి. డీజిల్ ధర పెరిగిందని హార్వెస్టర్ల వారు సుమారు గంటకు మూడు వేల రూపా యల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ధరలు పెంచుతూ పోతే మాలాంటి సన్న కారు రైతులు వ్యవసాయం చేయాలంటే భయమేస్తుంది.