e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News అప్పుల్లేవ్ ఆత్మహత్యల్లేవ్

అప్పుల్లేవ్ ఆత్మహత్యల్లేవ్

  • సమైక్య రాష్ట్రంలో అప్పులతో ఆగమాగమైన బతుకులు
  • స్వరాష్ట్రంలో పెట్టుబడి సాయం, సాగు నీరు, ఉచిత కరెంట్‌
  • కేసీఆర్‌ చర్యలతో చిన్న,సన్నకారు రైతుల ఆదాయం రెట్టింపు
  • ఏడాది పొడవునా రెండు పంటలతో కర్షకులకు చేతినిండా పని

ఆరుగాలం కష్టించినా పంటచేతికి వస్తుందన్న నమ్మకం లేదు.. దిగుబడి దక్కినా మిత్తికి పోను మిగిలేది అంతంతే.. చేసేది లేక అప్పుల పాలై అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు కోకొల్లలు. ఇదంతా రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం పరిస్థితి. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత వ్యవసాయం పండుగలా మారింది. సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంస్కరణలతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సాగునీటి రంగానికి పెద్దపీట వేయడం, 24గంటల విద్యుత్‌ సరఫరాతోపాటు రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి. ఇంతకుమునుపులా రోడ్డెక్కే పరిస్థితి లేకుండా పంట దిగుబడులను ఉత్పత్తులను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. దీంతో ఉమ్మడి జిల్లాలో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయి.
-నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

ఇప్పుడే లాభాలు చూస్తున్నం..

- Advertisement -

నాపేరు రాజన్న. మాది వేల్పూర్‌ మండలం మోతె. ఊరి చెరువుకట్ట కింద నాలుగు ఎకరాలుంది. తెలంగాణ రాక మునుపు పంటలు సాగు చేయాలంటే భయమేసేది. నీళ్లుండేవి కావు. కట్ట కిందనే పొలాలున్నా పంటలు వేసే పరిస్థితి లేకపోయేది. ఒకవేళ వానకాలంలో ధైర్యం జేసి పంటలేసినా కాలం కలిసిరాక నష్టాలే ఎదురయ్యేవి. కరెంట్‌ కోతలతో బోర్ల కింది పంటలు కూడా పండేవి కావు. అప్పుడు సాగుకు పెట్టిన ఖర్చులు రాక పరిస్థితి తారుమారు అయ్యేది. అప్పులు పెరిగి ఇబ్బంది పడినం. ఆస్తులమ్మి అప్పులు తీర్చిన రోజులు కూడా ఉన్నయ్‌. కేసీఆర్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వమే పెట్టుబడికి ఇస్తున్నది. టైముకు ఎరువులు, విత్తనాలు వస్తున్నయ్‌. గతంలో పంటలు అమ్ముకునేందుకు రోడ్డు ఎక్కేది. కానీ ఇప్పుడు మద్దతు ధరకు పంటను ప్రభుత్వమే కొంటున్నది. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చినంకనే మేం లాభాలను కండ్లజూస్తున్నం.
దశాబ్దాలుగా పంటలు సాగు చేస్తున్న రైతన్నలకు తెలంగాణకు ముందు, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత మారిన పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఏర్పడింది. సమైక్య పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. ఆత్మహత్యలతో ప్రతి గ్రామం కూనరిల్లింది. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల పరిస్థితులు తలచుకుంటేనే గుండె పగిలిపోయేది. పంటలు సాగు చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసే పరిస్థితి ఉండేది. కాలం కలిసి వస్తే సాగు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక సతమతమయ్యేది. వ్యాపారుల వద్ద వడ్డీలకు డబ్బులు తెచ్చుకుని పెట్టుబడులు పెట్టేది. కరెంట్‌ ఉంటే నీళ్లుండవు, నీళ్లుంటే కరెంట్‌ ఉండని విపత్కర కాలాన్ని ఆనాడు రైతులు ఎదుర్కొన్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వాలు చలించకపోయేది. దిగుబడులు లేక, ఆదాయం రాక… చివరకు అప్పులు చెల్లించలేక భూములు అమ్ముకునేది. లేదంటే ఉరి తాళ్లను ఆశ్రయించి తనువు చాలించిన రైతులు అనేక మంది నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉన్నారు. కానిప్పుడు రైతుకు పండుగలాంటి సాగు పరిస్థితులు దరి చేరాయి. ఆత్మహత్యకు ప్రేరేపించే కారణాలేవీ కంటికి కనిపించకుండా సీఎం కేసీఆర్‌ చేశారు. రైతుకు ప్రధానంగా పెట్టుబడి ఇబ్బంది లేకుండా రైతుబంధు అందించారు. 24గంటల నిరంతర కరెంట్‌ సరఫరా, ఢోకా లేకుండా సాగుకు నీళ్లు, సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నారు. పంట ఉత్పత్తులను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయడం ద్వారా కర్షక కుటుంబాలు లాభాలు ఆర్జిస్తూ ఆనందంగా జీవిస్తున్నాయి. 2014కు ముందు బీడుగా కనిపించిన భూములే ఇప్పుడు పచ్చని పంట పొలాలతో రైతు చిద్విలాసంగా కళకళలాడుతున్నాడు.

అప్పుల నుంచి విముక్తి..

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఎకరం నుంచి రెండున్నర ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు సగానికి ఎక్కువ మందే ఉన్నారు. పంట సీజన్‌లో సామాన్య రైతులకు పెట్టుబడికి పైసల్లేక సాగును వదిలేసి కూలీనాలీ చేసుకుంటూ పొట్ట పోసుకుని జీవించేవారు. ప్రభుత్వమే రైతుబంధు ద్వారా పెట్టుబడికి సాయం ఇస్తుండటంతో చిన్న, సన్నకారు రైతులకు ఊరట దక్కుతోంది. పెట్టుబడి డబ్బులు ఢోకా లేకపోవడంతో బీడు భూములను సైతం సాగు చేస్తున్నారు. తద్వార పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటుగా ఉత్పత్తి సైతం గణనీయంగా పెరుగుతోంది. 2018, మే 10న మొదలైన రైతుబంధు పథకం ఇప్పటి వరకు ఏడు విడతలు విజయవంతంగా అందింది. నిజామాబాద్‌ జిల్లాలో 2లక్షల 61వేల 273 మంది, కామారెడ్డి జిల్లాలో 2లక్షల 69వేల 592 మంది రైతులకు ఈ సీజన్‌లో రైతుబంధు అందించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెట్టుబడి సాయం కింద ఈ వానాకాలంలో రూ.530 కోట్లు చెల్లించారు. గతంలో ఈ విధంగా రైతులకు పెట్టుబడి అందించిన దాఖలాలే కరువు. తెలంగాణ సర్కారు చొరవ మూలంగా రైతుకు అప్పుల నుంచి విముక్తి లభించినట్లు అయ్యింది.

కంటికి రెప్పలా కాపాడుకుంటూ..

రైతులకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు అన్నదే లేవు. వ్యక్తిగతంగా ఇతరత్రా అవసరాలకు చేసేనవి తప్ప… వ్యవసాయం కోసం అప్పులు చేసి ఇబ్బందులకు గురైన సందర్భాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇక రైతులెవ్వరూ ఆత్మహత్యలు చేసుకునేంత దుస్థితి కండ్లకు కానరావడం లేదు. సాగుకు సకల వసతులు చేకూరడంతో ధైర్యంగా సాగులో బంగారు పంటలు పండిస్తూ కుటుంబంతో హాయిగా జీవనం సాగిస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో సాగులో అప్పుల పాలై ఉరి తాళ్లను ఆశ్రయించే వారు. ఇప్పుడా దుస్థితి కనుమరుగైంది. చిన్న, సన్నకారు రైతులను సంఘటితం చేసి, వారి ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గడిచిన కేసీఆర్‌ పరిపాలన కాలంలో అనేక అనుకూల నిర్ణయాలతో సాగు రంగం పరుగులు తీస్తున్నది. రైతులకు ఆర్థిక, సాంకేతిక సాయం అందించి వారి ఉత్పత్తులను ఎక్కువ ధరతో అమ్ముకునేలా చర్యలు తీసుకుంటున్నది. రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రభుత్వం కొండంత ధైర్యాన్ని కల్పిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో 3లక్షల 43వేల 897 మంది రైతులున్నారు. 5లక్షల 75వేల 589 ఎకరాల సాగు భూమి ఉంది. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 33వేల 187 మంది రైతులున్నారు. 4లక్షల 92 వేల 303 ఎకరాల సాగు భూములున్నాయి.

ప్రాణాలు నిలబెట్టిన ఉచిత విద్యుత్‌..

సాగుకు కరెంట్‌ ప్రధాన వనరు. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో వ్యవసాయం చేసుకోలేక అనేక మంది రైతులు గతంలో ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలున్నాయి. మరోవైపు రాత్రుల్లో వచ్చే కరెంట్‌తో పొలం పనులకు వెళ్లిన అనేక మంది మృత్యువాత పడ్డారు. సమయపాలన లేని విద్యుత్‌ సరఫరాతో సాగుదారులకు నిద్రే ఉండేది కాదు. హెచ్చుతగ్గులతో కూడిన కరెంట్‌ సరఫరాతో మోటర్లు చెడిపోవడంతో రైతులపై ఆర్థిక భారం పడేది. ట్రాన్స్‌ఫార్మర్లు పేలితే వాటి ఖర్చు అదనంగా ఉండేది. తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత రైతాంగానికి 24గంటల నిరంతర విద్యుత్‌ను విజయవంతంగా సరఫరా అవుతోంది. నూతన రాష్ట్రం ఏర్పాటు సమయానికి తెలంగాణలో తీవ్రమైన విద్యుత్‌ కొరత ఎదురైంది. గృహావసరాలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి కనీస స్థాయిలో విద్యుత్‌ సరఫరా చేయడం గగనమైన దుస్థితి. ఆంధ్రప్రదేశ్‌ సర్కారు కుట్రలను ఛేదించుకుని ఆరు నెలల్లోనే నిరంతర విద్యుత్‌కు బాటలు పరిచారు. మొదట పగలు పూట నిరంతరంగా 9గంటల వ్యవసాయ విద్యుత్‌ను అందించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే 24గంటల పాటు నిరంతర కరెంట్‌ సరఫరాతో కర్షకుల ప్రధాన సమస్యను సీఎం కేసీఆర్‌ పోగొట్టారు.

ధాన్యా గారాలుగా పల్లెలు..

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. యాసంగి, వానాకాలం సీజన్లలో ఉబికి వస్తోన్న పంట ఉత్పత్తులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. సర్కారు చర్యల మూలంగా ప్రతీ గ్రామంలో ధాన్యపు రాశులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. వానకాలంలో సంవృద్ధిగా కురిసిన వర్షాలకు తోడుగా చెరువులన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. వాతావరణం కలిసి రావడంతో సహజంగానే వానకాలం పంటల సాగు రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నది. యాసంగి పంటలంటే గతంలో ఎంతో నిర్లక్ష్యం. రైతుల్లోనూ ఎడతెగని నిరాశ. సాగు నీళ్లకు కటకటతో పంటలు వేయాలంటేనే భయం. కొద్ది కాలంగా యాసంగి సీజన్‌లో వరి పంట సాగు భారీగా పెరిగింది. గడిచిన యాసంగి సీజన్‌లో నిజామాబాద్‌ జిల్లాలో రూ.1398కోట్లతో 7లక్షల 43వేల 531 మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని సేకరించారు. కామారెడ్డి జిల్లాలో రూ.850.42కోట్లతో 4లక్షల 51వేల 154 మెట్రిక్‌ టన్నులు సేకరించారు. ప్రతీ పల్లెలు ధాన్యాగారమై కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. దిగుబడులు సైతం పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 25క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తోన్న సహకారంతో రైతులు ధైర్యంగా ముందడుగు వేసి విజయం సాధిస్తున్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement