పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెరుగుతున్నది. కరోనా కారణంగా ఏడాదిన్నర పాటు మూతబడిన విద్యాసంస్థలు గతనెల ఒకటో తారీఖు నుంచి తెరుచుకున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుండడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. తల్లిదండ్రులు సైతం విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు ధైర్యం చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటివారంలో 35గా ఉన్న విద్యార్థుల హాజరుశాతం.. ప్రస్తుతం 60 శాతానికి చేరుకున్నది. ప్రభుత్వ స్కూళ్లలో 72శాతం హాజరు ఉండగా.. ప్రైవేటులో ఇది 48శాతానికి మించడం లేదు. కొవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోకపోవడంతో నిబంధనలు పాటించాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
నిజామాబాద్, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మూ లంగా ఏడాదిన్నర పాటు మూత పడి న విద్యా సంస్థలు గత నెల ఒకటో తా రీఖు నుంచి తెరుచుకున్నాయి. రాష్ట్రం లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగ డంతో ప్రభుత్వం కీలకమైన నిర్ణ యం తీసుకుంది. విద్యార్థులకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా ఉం డేందుకు తగు జాగ్రత్తలతో పాఠశాలలను పునః ప్రా రంభించింది. సెప్టెంబర్ 1న ప్రత్య క్ష తరగతులకు హాజరైన విద్యార్థు ల సంఖ్య అత్యల్పంగానే ఉండగా… రోజులు గడిచేకొద్ది బడులకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో స్కూళ్లు ప్రారంభమైన తొలి వారంలో 35 శాతం వరకే విద్యార్థులు హాజరవ్వగా… ప్రస్తుతం వీరి సంఖ్య రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం అన్ని విద్యాసంస్థల్లో 60శాతం మేర విద్యార్థు లు ఆఫ్లై న్ క్లాసులకు వెళ్తున్నారు. మిగిలి న వారు ఇంటి వద్దే ఆన్లైన్ క్లాసులు విం టున్నారు. కరోనా ముప్పు పూర్తిగా తొలగి పోకపోవడంతో స్పష్టమైన మార్గదర్శకాల ను సైతం జారీ చేసింది. అయితే… పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో నిబంధనలు ఏవీ పాటించడం లేదు. పాఠశాలల్లో పని చేసే సిబ్బంది కనీసం మాస్కులను ధరించడం లేదు. శానిటైజర్ల వినియోగం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ స్కూళ్లకు బారులు..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు నడుస్తున్నాయి. ఇందులో అన్ని పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులు సగానికి ఎక్కువ మంది బడులకు వెళ్తుండగా అత్యధికంగా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న వారే ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్త చర్యలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో సర్కారు బడులపై నమ్మకం పెరిగింది. దీంతో కొవిడ్ వంటి విపత్కర సమయంలోనూ ధైర్యంగా పంపుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1166 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం లక్షా 9వేల 317 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 78,963 మంది నేరుగా పాఠశాలలకు వెళ్లి పాఠాలు నేర్చుకుంటున్నారు. మొత్తం విద్యార్థుల్లో 72.23 శాతం మంది హాజరవుతుండడం విశేషం. నిజామాబాద్ జిల్లాలో 468 ప్రైవేటు విద్యాసంస్థల్లో లక్షా 18వేల 678 మంది విద్యార్థులు ఆయా తరగతుల్లో పేరు నమోదు చేసుకున్నారు. వీరిలో 48.87 శాతం అంటే 58,001 మంది మాత్రమే స్కూళ్లకు వస్తున్నారు. ఎయిడెడ్ స్కూళ్లు 39 ఉండగా వీటిల్లో 9,333 మంది విద్యార్థులుండగా 30.04 శాతం అంటే 2804 మంది మాత్రమే ప్రత్యక్ష తరగతులకు వస్తుండడం విశేషం.
బకాయిలపైనే ఆసక్తి..
ప్రైవేటు విద్యా సంస్థలకు గడిచిన రెండు సంవత్సరాలుగా స్కూల్ ఫీజులు ఆశించినంత వసూలు కాలేదు. ప్రభుత్వం అన్ని తరగతులను తెరవడంతో విద్యార్థులతో స్కూళ్లు కాసింత కళకళలాడుతున్నాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్ బోధనతో ప్రతి విద్యార్థికీ బోధన అందిస్తున్నారు. దీంతో గత బకాయిలను రాబట్టుకునేందుకు ప్రైవేటు నిర్వాహకులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. స్కూల్ మారి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన వారికి సైతం ఇంటికొచ్చి పాత ఫీజులు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. 2020-21 ఏడాదిలో విద్యా సంవత్సరమంతా ఆన్లైన్లోనే గడిచింది. చాలా మంది విద్యార్థులు వారి కుటుంబాల ఆర్థిక స్థోమతను బట్టి ఇతరత్రా ఏర్పాట్లు చేసుకున్నారు. స్కూల్‌ను విడిచి వెళ్లిన వారికి ఫీజుల తంటాలు తప్పడం లేదు. ఓ వైపు ఫోన్లతో పాటు ఇంటికొచ్చి ఫీజులు చెల్లించాలంటూ ముక్కు పిండి వసూళ్లు చేస్తుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో స్కూల్ బస్సుల రవాణా చార్జీలు సైతం ఎడాపెడా పెంచేశారు. మొన్నటి వరకు రూ.1500 వరకు ఉన్నటువంటి బస్ చార్జీలు ఇప్పుడు ఏకంగా రూ.2వేల నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తుండడం కనిపిస్తోంది.
నిబంధనల ఉల్లంఘన..
కొవిడ్ -19 విపత్కర పరిస్థితుల అనంతర పాఠశాలలు పునః ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రైవేటు విద్యా సంస్థల్లో తప్పనిసరిగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. అయితే… కొన్ని విద్యాసంస్థల నిర్వాహకులు అలాంటివేవీ పట్టించుకోవడం లేదు. కనీస జాగ్రత్త చర్యలు సైతం తీసుకోవడం లేదు. విద్యాసంస్థ ఆవరణలో సిబ్బందికి కనీసం మాస్కు వాడకంపై అవగాహన లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మాస్కు లేకుంటే అనుమతి ఇవ్వకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. స్కూళ్లలో వీలైనంత మేరకు భౌతిక దూరం పాటించేలా తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా సబ్బు, లిక్విడ్ అందుబాటులో ఉండేలా చేసి ఆదేశాలు బేఖాతరు అవుతున్నాయి. పాఠశాలల పునః ప్రారంభంతో తెరుచుకున్న ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో స్థితిగతులపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నిజామాబాద్ విద్యా శాఖ అధికారులు మాత్రం కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ప్రైవేటులో నిర్లక్ష్యానికి కళ్లెం వేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లకు ఆదరణ బాగుంది. గత నెలతో పోలిస్తే ఇప్పుడు హాజరుశాతం భారీగా పెరిగింది. పట్టణాల్లోనే హాజరు శాతం తక్కువగా ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రైవేటు పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలను ఉల్లంఘనపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.