తెలంగాణ యూనివర్సిటీ అంటే ఏమనుకుంటున్నవ్..? వాట్ ఈజ్ దిస్ వీసీ గారూ.. యూఆర్ డూయింగ్ రాంగ్.. ఇలాగైతే జైలుకెళ్లాల్సి రావొచ్చు. అప్పుడు మేము ఏమీ చేయలేము. వెంటనే అవుట్సోర్సింగ్ నియామకాల రద్దుపై స్పష్టమైన ప్రకటన చేయండి. ప్రభుత్వ అనుమతి లేకుండా నియామకాలు చేపట్టేందుకు అవకాశమే లేదు. ఈసీ మీటింగ్‌లో చర్చించ కుండానే మీకు తోచినట్లుగా రిక్రూట్ చేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీరు చేయరాని తప్పులు చేశారు. మీరు మారకపోతే మీకే నష్టం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జైలుకు పోవడం ఖాయం.
ఎనిమిది నెలల తర్వాత శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. నిబంధనలకు విరుద్ధంగా అవుట్సోర్సింగ్ నియామకాలు చేపట్టిన వైస్ చాన్స్‌లర్ రవీందర్గుప్తాపై పాలకమండలి సభ్యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమావేశ ప్రారంభంలోనే ఎజెండాను పక్కనపెట్టిన సభ్యులు.. వీసీ రవీందర్‌గుప్తా, ప్రొఫెసర్ కనకయ్య తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈసీ మీటింగ్ పెట్టాలని ప్రభుత్వం నుంచి 11రోజుల ముందే ఆదేశాలు వచ్చినప్పటికీ.. కొన్నిగంటల ముందే సభ్యులకు సమాచారం ఇవ్వడమేంటని వారు ప్రశ్నించారు. సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సైతం వీసీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 30కి ఈసీ మీటింగ్‌ను వాయిదా వేస్తున్నామని.. అప్పటిలోగా వివాదాస్పద నియామకాలన్నింటినీ రద్దుచేయాలని ఆయన ఆదేశించారు.
నిజామాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎనిమిది నెలల తర్వాత శుక్రవారం ని ర్వహించిన తెలంగాణ యూనివర్సిటీ పాలక మం డలి సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. నెలన్నర రోజులుగా ఎడాపెడా నియమించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను సక్రమం చేసుకునేందుకు వీసీ రవీందర్ గుప్తా, ప్రొఫెసర్ కనకయ్య చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈసీ అనుమతి లేకుండా జరిగిన తంతును సభ్యులంతా కొట్టి పారేశారు. ప్రభుత్వం నుంచి 11 రోజుల ముందే ఈసీ మీటింగ్ పెట్టాలని ఆదేశాలు వచ్చాయి. సభ్యులకు సమాచారాన్ని చేరవేయడంలో యూనివర్సిటీ పెద్దలు కావాలనే జాప్యం చేసినట్లుగా గుర్తించారు. శుక్రవారం మీటింగ్ ఉంటే గురువారం మధ్యా హ్నం హఠాత్తుగా సమాచారాన్ని చేరవేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎజెండా అంశాలను 170 పేజీల బుక్‌లెట్‌తో పాటు రెండు కిలోల స్వీట్ డబ్బా ను, ఈసీలకు ఆకర్షణీయమైన బహుమతిని అం దించారు. స్వీట్లు, బహుమతులను ఈసీ సభ్యులు తిరస్కరించారు. ఈసీ మీటింగ్ ప్రారంభంతోనే ఎ జెండాను పక్కన పెట్టి వైస్ ఛాన్స్లర్, ప్రొఫెసర్ కనకయ్య తీరుపై గంటసేపు చర్చించారు. వీరు ఇరువురు కలిసి చేసిన, చేస్తోన్న అక్రమాలను లేవనెత్తారు. గంటసేపటికే ఈసీ మీటింగ్‌ను రద్దు చేస్తున్నట్లు పాలక మండలి ప్రకటించింది. సమావేశాన్ని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. టీయూ మెయిన్ క్యాంపస్‌లోనే తదుపరి ఈసీ మీటింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
ఇలాగైతే జైలుకే…
టీయూ పాలక మండలి సమావేశంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. అడ్డదారుల్లో నియామకమైన 113 మందికి త్వరలోనే మంగళం పాడనున్నారు. రూ.లక్షల్లో ముడుపులు తీసుకుని ని యామకాలు చేపట్టిన వారి బాగోతాలు నెలాఖరు కు బట్టబయలు కానున్నాయి. పాలక మండలి సమావేశంలో రహస్య ఎజెండాతో సమావేశానికి వచ్చిన వీసీ రవీందర్ గుప్తా, ప్రొఫెసర్ కనకయ్య ఆటలు చెల్లుబాటు కాలేదు. ఎలాగైనా తమ ఎజెండాను ఆమోదం పలికించుకుంటే నియామకాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనని ఊహించుకున్నారు. కానీ ఈసీ సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి ఎజెండాలోని సింగిల్ లైన్ వ్యాఖ్యను ఎవరూ ముట్టుకోలేదు. ఈసీ మీటింగ్ ప్రారంభం నుంచి వాయిదా వేసేంత వరకు వీసీ వ్యవహార శైలిపైనే సభ్యులంతా చర్చించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తు న్న తీరును తప్పుపడుతూ అందరూ మందలించారు. వీసీ హోదాలో పని చేసే వ్యక్తులు గౌరవప్రదంగా ఉండాలంటూ హితబోధ చేశారు. ఇష్టానుసారంగా ఉంటానంటే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే జైలుకు పంపుతామంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. జైలుకు పంపుతామనే మాట ఏకంగా మూ డుసార్లు ముగ్గురి నోటి నుంచి రావడం శోచనీయం.
కనకయ్య ఇన్‌చార్జీయే…
రెండు నెలల క్రితం వీసీ రవీందర్ గుప్తా హడావుడిగా ప్రొఫెసర్ కనకయ్యను రిజిస్ట్రార్‌గా నియమించారు. ఈయన నియామకానికి ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. కనీసం ఈసీ మీటింగ్‌లోనూ చర్చించలేదు. ఈసీ సభ్యులెవ్వరూ ఆమోదం తెలుపలేదు. రెండు నెలలుగా కనకయ్యతో రిజిస్ట్రార్ హోదాలో వీసీ ఇష్టారీతిన అనేక పనులు చేయించుకుంటున్నారు. ప్రమోషన్లు, బదిలీలు, శాఖాపరమైన పనులతో పాటు పలు నియామకాలను చేపట్టారు. ఇదంతా అక్రమమేనని ఈసీ సభ్యులు తేల్చి చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాల్సిందేనని చర్చించారు. రిజిస్ట్రార్‌గా కనకయ్య వ్యవహరించడం నిబంధనలకు విరుద్ధమని స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ సైతం స్పష్టం చేశారు. నూతన రిజిస్ట్రార్ నియామకం అయ్యేంత వరకు కనకయ్య కేవలం ఇన్చార్జి బాధ్యతలే నిర్వహించాలని చెప్పారు. ఇంత కాలం రిజిస్ట్రార్‌గా కనకయ్య తీసుకున్న నిర్ణయాలను, ఆయన జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా సూ చించారు. శుక్రవారం నాటి ఈసీ మీటింగ్‌కు ప్రొఫెసర్ కనకయ్య హాజరవ్వడంపై ఉన్నత విద్యా శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
క్షమాపణలు చెప్పిన వీసీ
వీసీగా నియామకమైన నాటి నుంచి నేటి వరకు ర వీందర్ గుప్తా పనితీరుపై ఈసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియమించిన పాలక మండలి సభ్యులను కించపరిచే విధం గా వ్యాఖ్యానించడం, అవమానపర్చడంపై వీసీని సభ్యులంతా కలిసి గట్టిగా మందలించారు. మొన్నటి మీడియా సమావేశంలో ఈసీ మెంబర్ల పేర్లను ప్రస్తావించడం, తమకు సహకరించడం లేదంటూ ప్రకటనలు చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఇష్టానుసారంగా యూనివర్సిటీలో పరిపాలన నిర్వహిస్తూ ఈసీలపై బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేశారంటూ నిలదీశారు. ప్రభుత్వం నియమించిన పాలక మండలి సభ్యులపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ కల్పించుకుని సభ్యులందరికీ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని వీసీని కోరారు. చేసేది లేక వీసీ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీ సుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పారు. ఆవేశంలోనే అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. కొంత మంది వ్యక్తులు తప్పుదోవ పట్టించారని ఇతరులపై నింద లు మోపేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది.
బోల్తా కొట్టిన యాక్షన్ ప్లాన్…
వీసీగా రవీందర్ గుప్తా నియామకం తర్వాత టీయూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభాసుపాలైంది. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం, ఎదిరించిన వారిని లెక్కచేయకపోవడంతో గందరగోళం నెలకొంది. యూనివర్సిటీకి అంతా తానే అన్నట్లుగా ప్రవర్తించడంతో వివాదం రోజుకొకటి వెలుగు చూసింది. తననెవరూ ఏమీ చేయలేరంటూ తోచినట్లు వ్యవహరించుకుంటూ వచ్చారు. వీసీ స్వయంగా నిర్వహించిన మీడియా సమావేశంలోనే ద్వంద్వ ప్రకటనలు వెలువరించారు. తన అధికారంతో ఏదైనా చేసుకోవచ్చని, పరిపాలనా సౌలభ్యం కోసం అవసరాన్ని బట్టి నియామకాలు చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. ఈసీ మీ టింగ్‌లో పప్పులేవీ ఉడకకపోవడంతో వీసీ అనుకున్నదంతా అడ్డం తిరిగింది. రిజిస్ట్రార్ నియామకంతో మొదలు పెడితే అవుట్ సోర్సింగ్ నియామకా ల వరకు అన్నింటికీ ఉద్వాసన తప్పదనే సంకేతాలు వెలువడడంతో వక్రమార్గంలో యూనివర్సిటీలోకి వచ్చిన వారంతా ఆగమాగం అవుతున్నారు. యూనివర్సిటీల్లో ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు, వంట మనుషులుగా పని చేసిన వారి వివరాలను పోలీసులు నిఘా వర్గాలు సేకరించాయి. ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ముట్టజెప్పారనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.