e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News గంజాయిపై లడాయి..

గంజాయిపై లడాయి..

  • సాగు, స్మగ్లింగ్‌పై యుద్ధం ప్రకటించిన సర్కారు
  • నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో సాగు తగ్గినా ఆగని అక్రమ రవాణా
  • గాంధారి, సదాశివనగర్‌, మోపాల్‌ మండలాల్లో అత్యధికంగా సాగు కేసులు
  • రైతన్నల ముసుగులో అడ్డదారులు తొక్కుతున్న అక్రమార్కులు
  • ముఖ్యమంత్రి కఠిన ఆదేశాలతో రంగంలోకి యంత్రాంగం
  • గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వ పథకాల నిలిపివేతపై ప్రచారం

గంజాయిపై సాగు, స్మగ్లింగ్‌ను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తున్నది. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే లక్ష్యమని.. ఇందుకోసం అవసరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీవ్రతరం చేశారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గంజాయి సాగు తగ్గినా అక్కడక్కడా అక్రమ రవాణా కొనసాగుతున్నది. ఇటీవలికాలంలో పలుచోట్ల నిర్వహించిన దాడుల్లో గంజాయి క్షేత్రాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతున్నది. అటవీప్రాంత గ్రామాల్లో రైతుల భూములను అక్రమార్కులు కౌలుకు తీసుకుని పత్తి, కంది చేన్లలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సీఎం ఆదేశాలతో అప్రమత్తమైన యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో గంజాయి సాగు, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నది. గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలను నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు.

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అత్యాశకు పోయి కొంతమంది అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. రైతు ముసుగులో చేయరాని పనిని చేస్తున్నారు. అమాయకుల భూములను కౌలుకు తీసుకుని గంజాయి సాగు చేస్తున్నారు. అందరూ పండించినట్లే పత్తి, కంది సాగు చేస్తున్నామని చెబుతున్నా… అంతర పంటగా గంజాయి మొక్కలను పెంచుతున్నారు. పండించిన దానికి సొంత అవసరాలకు, సన్నిహితులకు ఇవ్వడం, మరికొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నారని సమాచారం. ఒక వేళ సమాచారం పోలీసులకు తెలిస్తే వారు వెంటనే తప్పించుకుని పారిపోతున్నారు. ఆబ్కారీ, పోలీసు శాఖల పైపై దాడుల్లో కొద్దిమంది మాత్రమే పట్టుబడుతుండడంతో వారిపై కేసు నమోదు చేస్తున్నారు. నెల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో నాలుగైదు గంజాయి కేసులు నమోదు కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఊరికి దూరంగా ఉన్న పొలాలే అనువైన భూములుగా చూసుకుంటున్నారు. పత్తి, కంది మొక్కల్లో అక్కడక్కడ ఈ విత్తనాలు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క కనిపించొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇకనైనా పోలీసులు, ఆబ్కారీ శాఖల అధికారులు సమన్వయం తో దాడులు నిర్వహించి గంజాయి రవాణాను పూర్తిగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

నేరమని తెలిసినా…

గంజాయి సాగు, రవాణా చట్ట రీత్యా నేరం. ప్రభు త్వం నిషేధించినా… అక్రమార్కులు తమ పంథా ను వీడడం లేదు. గతంతో పోలిస్తే గంజాయి మొక్కల పెంపకం తగ్గినా రవాణా గుట్టు చప్పుడు కాకుండా పరిగెడుతూనే ఉంది. నిఘా, తనిఖీల లోపంతో దళారులకు రూ.లక్షల వ్యాపారం కలిసొచ్చేలా చేస్తోంది. ఇంటర్‌, డిగ్రీ చదువుతోన్న యువ త లక్ష్యంగా ఎండు గంజాయి ప్యాకెట్లను కొందరు వ్యక్తులు వారికి అందించి బానిసలుగా చేస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో అడవిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగుతున్నది. అత్యధికంగా గాంధారి, సదాశివనగర్‌, నిజామాబాద్‌ రూరల్‌, మోపాల్‌, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో గంజాయి సాగు తిరిగి పురుడు పోసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్‌ ఆబ్కారీ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తనిఖీలు చేపట్టడం లేదు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో గుట్టుగా మత్తు మొక్కల సాగు జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా రైల్వే స్టేషన్లను గంజాయి రవాణాకు ప్రధాన అడ్డాగా చేసుకుని దిగుమతి, ఎగుమతి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైల్వే పోలీసులతో పాటు స్థానిక పోలీసుల నిఘా లేకపోవడంతో గంజాయి సరఫరా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా నడుస్తోంది. కొంత మంది యువకులు కార్లలో ఎవరికీ అనుమానం రాకుండా సరఫరాలో కీలకంగా పని చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి.

గుట్టుగా గంజాయి సాగు…

ఉమ్మడి జిల్లాలో గంజాయి సాగు ఆగడం లేదు. తరచూ ఏదో ఒక చోట గంజాయి మొక్కలు బయ ట పడుతున్నాయి. గతంలో కామారెడ్డి డివిజన్‌ పరిధిలోని గాంధారి మండలం నుంచి గంజాయి దందా జోరుగా కొనసాగేది. మండలంలోని కొన్ని గ్రామాలు, తండాల వారు అటవీ ప్రాంతాలతో పాటు వారు సాగు చేసే పంట పొలాల్లో అంతర పంటగా గంజాయిని పండించే వారు. నిజామాబాద్‌ జిల్లాలోని సిరికొండ, డిచ్‌పల్లి, ధర్పల్లి, మోపాల్‌ మండలంలోని మంచిప్ప గ్రామాల్లో గం జాయి సాగు చేస్తున్నారు. గాంధారి నుంచి క్వింటా ళ్ల చొప్పున మహారాష్ట్ర, ఇతర మహానగరాలకు సరఫరా చేసేవారు. మహానగరాల్లో ఎండు గంజాయికి పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంది. కిలో గంజాయి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు పలుకుతుండడంతో సులువుగా డబ్బులు సంపాదించడం కో సం అనేక మంది ఈ తోవ పడుతున్నారు. ఎక్సైజ్‌, పోలీసులు, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో వరుస దాడులు కరువవ్వడం మూలంగా గంజాయి సాగుదారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాడ్వాయి మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఏకంగా నివాస గృహం వద్ద గంజాయి మొక్కలను పెంచుకున్నాడంటే పరిస్థితి ఎంత వరకు చేరిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట గ్రామంలోనూ ఓ ఇంటి వద్ద పది గంజాయి మొక్కలు పట్టుబడ్డాయి. జుక్కల్‌ మండలం కౌలాస్‌ గ్రామంలో పాండవుల గుట్టలో వేయి వరకు గంజాయి మొక్క లు లభించగా… మద్నూర్‌ మండలం పెద్దతడుగురులో 54 గంజాయి మొక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సీఎం కఠిన నిర్ణయం…

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పత్తి, మక్కజొన్న పంటల్లో అంతర పంటగా గంజాయిని రహస్యంగా సాగు చేస్తున్నారు. పది రోజుల క్రితమే సదాశివనగర్‌, బిచ్కుంద, మద్నూ ర్‌, గాంధారి, ఎల్లారెడ్డి, మెండోరా, కమ్మర్‌పల్లి, వేల్పూర్‌ క్రాస్‌ రోడ్డులో గంజాయిని పట్టుకున్నా రు. సదాశివనగర్‌ మండలం యాచారం పరిధిలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను తొలగించడంతో పాటు సాగు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల నుంచి గంజాయి ఎక్కువగా మహారాష్ట్రకు సరఫరా అవుతోంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎండు గంజాయి దిగుమతి అవుతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి రాత్రి వేళల్లో కొందరు వచ్చి గంజాయిని తీసుకెళ్తున్నారని ఆయా ప్రాంతాల్లోని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్‌ శివారులో వివిధ రంగాలకు చెందిన పలువురు పెద్దలకు వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ వారాంతాల్లో విందు, వినోదాల కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ ప్రాంతాలకు గుట్టుగా మత్తు పదార్థాలు రవాణా జరుగుతున్నాయనేది ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అక్టోబర్‌ 20న సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించా రు. సంబంధిత శాఖలకు కఠిన ఆదేశాలు ఇచ్చారు. ఇకపై గంజాయి సాగు చేసే రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను నిలిపేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో ప్రభావిత ప్రాంతా ల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఎక్సై జ్‌, పోలీసు శాఖలు సమాయత్తం అవుతున్నాయి.

గంజాయి సాగుపై సమాచారం ఇవ్వండి

గంజాయి రవాణా అరికట్టేందుకు, శాశ్వతంగా రూపు మాపేందుకు జిల్లాలో ఆబ్కారీ శాఖకు సమాచారం ఇవ్వడానికి ప్రజలు ముందుకు రావాలి. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతాం. ఎక్కడైనా ఎండు గంజాయి రవాణా చేసినా, మొక్కలు సాగు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. విస్తృతంగా తనిఖీలు చేపట్టి గంజాయి సాగు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతాం.

  • నవీన్‌ చంద్ర,
    నిజామాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement