ఇందూరు, నవంబర్ 18 : బాధ్యత ఉన్న ప్రతిఒక్కరూ పోలీసేనని డీసీపీ అరవింద్‌బాబు అన్నారు. ట్రాఫిక్ సీఐ చందర్‌రాథోడ్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ఫంక్షన్‌హాలులో ఆటో డ్రైవర్లకు గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన అరవింద్‌బాబు మాట్లాడుతూ రాత్రీపగలు తేడాలేకుండా ప్రజలకు సేవ చేస్తున్న ఆటోడ్రైవర్లకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. ప్యాసింజర్లతో బాధ్యతగా వ్యవహరించాలని, లైసెన్సు లేనివారికి ఆటోను అద్దెకు ఇవ్వవద్దని సూచించారు. మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ ఆటో నడుపవద్దన్నారు. ఆటోలను ఎక్కడపడితే అక్కడ నిలుపవద్దని, రోడ్డుపక్కన పార్క్ చేయాలన్నారు. ఆటోలకు నంబర్ సిస్టం పెట్టే ఆలోచనలో ఉన్నామని, నంబర్ సిస్టం ఉంటే దొంగతనాలు, ప్రమాదాలు జరిగినప్పుడు త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని అన్నారు. అనంతరం ఆటో, డ్రైవర్స్ యూనియన్ల నాయకులు అడిగిన సందేహాలకు డీసీపీ సమాధానాలు ఇచ్చి నివృత్తి చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు, సిబ్బంది, నిజామాబాద్ ఆటో యూనియన్ సభ్యులు దొడ్ల సాయిలు, శంకర శ్రీనివాస్, గంగాధర్, షాదుల్, గఫూర్, నర్సింహస్వామి, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.