అన్నదాతల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నేతలు లడాయికి సిద్ధమవుతున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గురువారం తలపెట్టిన మహాధర్నా కార్యక్రమానికి తరలివెళ్లనున్నారు. రాష్ట్రసాధన నాటి నుంచీ వ్యవసాయరంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పెట్టుబడిసాయం మొదలు పంట కొనుగోళ్ల వరకు అడుగడుగునా శ్రద్ధ వహిస్తూ వస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రాష్ట్రప్రభుత్వం కర్షకుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నా.. దాన్ని కొనుగోలు చేయకుండా కేంద్రప్రభుత్వం కొర్రీలు పెడుతున్నది. కేంద్రం తీరును నిరసిస్తూ సీఎం కేసీఆర్ రైతుల పక్షాన ఉద్యమం మొదలుపెట్టారు. ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల సారథ్యంలో ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని కేంద్రం తీరుపై నిరసన వ్యక్తంచేశారు. తాజాగా రాజధానిలో మహాధర్నాకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నేడు చేపట్టనున్న ధర్నాలో ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, జడ్పీచైర్మన్లు ముఖ్యప్రజాప్రతినిధులందరూ పాల్గొననున్నారు.
నిజామాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతన్నల మేలు కోసం ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిషలు శ్రమిస్తున్నారు. వారు పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకుని పరిష్కార మార్గాలను చూపించారు. పంటకు పెట్టుబడి సాయం అందించడం దగ్గరి నుంచి పంటల కొనుగోలు వరకు ప్రభుత్వమే వెన్నుదన్నుగా నిలిచి రైతు ప్రభుత్వంగా దేశంలో ఖ్యాతికెక్కింది. అన్నదాతల మేలు కోసం సీఎం కేసీఆర్ వినూత్న పథకాలు అమలు చేయడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. రైతుల మద్దతును చూరగొన్న టీఆర్ఎస్ను ఇబ్బందుల పాలు చేయాలనే కుట్రతో గడిచిన మూడు పంట సీజన్ల నుంచి కేంద్రమే కుయుక్తులు పన్నుతున్నది. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న సంప్రదాయాన్ని తోసిరాజని రాజకీయాలకు తెర లేపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసాలకోర్చి సేకరించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు కొర్రీలు పెడుతూ బీజేపీ తన వక్రబుద్ధిని చాటుకుంటున్నది. ఈ వ్యవహారాన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది కాలంగా కేంద్ర సర్కారు తీరును తీవ్రంగా ఎండగడుతూ వస్తున్నారు. తాజాగా ఇందిరాపార్క్ వద్ద గురువారం మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, జడ్పీ సారథులంతా తరలివెళ్లనున్నారు.
ధర్నాకు గులాబీ దండు..
రైతు కంట కన్నీరు చూడొద్దనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కిరికిరిని ప్రజలకు వివరిస్తూనే రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ధాన్యం సేకరణలో ఎదురైన ఆటంకాలు, కేంద్రం విధిస్తోన్న ఆంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నవంబర్ 12న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల సారథ్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవంతంగా జరిగిన ఈ ధర్నాలో రైతన్నలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బీజేపీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. నడవ చాతకాని వృద్ధులు సైతం అనేక చోట్ల ధర్నాలో పాలుపంచుకుని కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహా ధర్నాకు పిలుపునివ్వడం మరోమారు రైతన్నల దృష్టిని ఆకట్టుకుంది. గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన ధర్నాకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా పరిషత్ సారథులంతా కలిసి పాల్గొనబోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, రాజేశ్వర్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్, బిగాల గణేశ్ గుప్తా, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభతో పాటు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ పాల్గొనబోతున్నారు.
జోరుగా కొనుగోళ్లు..
ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వానకాలం 2021 వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఊరూరా ఏర్పాటు చేసిన కేంద్రాలతో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో సుమారు 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. నెలాఖరులోగా సగానికి ఎక్కువ చోట్ల ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి కానుంది. అకాల వానలు అడపాదడపా కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలతో సంబంధిత శాఖల అధికారులు నేరుగా రైతులకు సమాచారం చేరవేసి అప్రమత్తం చేస్తున్నారు.
రైతు పేరిట బీజేపీ కుట్ర..
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణంగా భారీగా పెరిగింది. ఎటు చూసినా పంట కాలంతో పని లేకుండా సాగు భూములు నిత్యం పచ్చని తోరణాలుగా విలసిల్లుతున్నాయి. పుష్కలంగా జల వనరులు అందుబాటులో ఉండడంతో పాటు సాగుకు గతంలో ఎదురైన ఇబ్బందులు తొలగిపోవడంతో రైతులు సాగును సంబురంగా నిర్వహిస్తున్నారు. ఏడేండ్లుగా కష్టమనేది లేకుండా పంటలు సాగు చేస్తూ రైతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. పంట ఉత్పత్తులు సైతం భారీగా పెరిగాయి. దిగుబడులు అత్యధికంగా సాధిస్తూ రైతులు ఎవరికి వారే పోటీ పడుతున్నారు. స్వరాష్ట్రంలో వెలుగు చూసిన రైతు విజయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో వ్యవసాయ రంగం పురోగమిస్తుండడం, దేశంలోనే రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులతో రాష్ట్రం ముందు వరుసలో నిలుస్తుండడంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి కంటగింపు అవ్వడం లేదు. వచ్చే సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచి కుట్రలకు తెర లేపింది. తమ అధికార దర్పానికి రైతులను రాజకీయ వస్తువుగా మార్చుకుని తెలంగాణ అభివృద్ధి బాటకు కాళ్లు అడ్డం పెట్టి అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ర్టాల అభివృద్ధిని చూసి కేంద్రం ఆనందించాలి. అవసరమైతే ఆర్ధిక సాయం అందించి ప్రోత్సహించాలి. అందుకు విరుద్ధంగా బీజేపీ కుట్రలకు దిగుతుండడం దురదృష్టకరమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.