దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి మొన్నటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బేషరతుగా రైతుల పంటలను సేకరించాయి. రాష్ర్టాలు సేకరించిన పంట ఉత్పత్తులను వివిధ సంస్థల ద్వారా సేకరించి ఆయా రాష్ర్టాల అవసరాల నిమిత్తం సరఫరా చేసేవి. ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి రైతులకు వ్యతిరేకమైన పంచాయితీ మొదలైంది.
నిజామాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కార్పొరేట్ దిగ్గజాలకు రెడ్ కార్పెట్ వేస్తోన్న మోదీ సర్కారు.. సామాన్య రైతుల పొట్ట కొట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి అభాసుపాలైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏకంగా సుప్రీం కోర్టు మందలించిన సంగతి దేశ ప్రజలు గమనించారు. తాజాగా ఇప్పుడు వరి పంట పేరిట బీజేపీ చేస్తోన్న రాజకీయంతో సామాన్యులు బలి అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా భారత ఆహార సంస్థ ద్వారా సేకరించాల్సిన వరిని తెలంగాణ నుంచి తీసుకునేందుకు మోకాలడ్డుతున్నది. ఫలితంగా వరి పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తీరు మార్చుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతుల మేలుకోసం ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచనలు చేస్తున్నది. మరోవైపు బీజేపీ సర్కారుపై పోరుబాటకు సిద్ధమైంది. కేంద్రం వైఖరిని బట్టబయలు చేసేందుకు టీఆర్ఎస్ తరఫున ఉద్యమం మొదలైంది.
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు..
యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం 8లక్షల 94వేల 654 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. 3లక్షల 12వేల 786 మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 5లక్షల 78వేల 880 ఎకరాల్లో పంటల విస్తీర్ణం ఉండగా 2లక్షల 28వేల 345 మంది రైతులున్నారు. యాసంగిలో రైతులెవ్వరికీ నష్టం జరుగకుండా సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. రైతులను చైతన్యం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చనే ఆలోచనను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. కేంద్రం అవలంబిస్తున్న తీరును ఎండగడుతూనే రైతులకు లాభం జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భిన్న రకాలైన నేలలున్నాయి. మొదటి నుంచి ఈ ప్రాంతాల్లో రకరకాల పంటలు సాగవుతున్నాయి. గడిచిన ఐదారేండ్లుగా నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో రైతులంతా వరినే ఎంచుకుంటున్నారు. తిరిగి పాత పద్ధతుల్లో అంతర పంటలను, ఆరుతడి పంటలను, వాణిజ్య పంటలను, పప్పు దినుసు పంటలను సాగు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు.
అప్పుడు.. ఇప్పుడు భారీ తేడా
ఆరుగాలం శ్రమించే రైతుకు కష్టమొస్తే గత ప్రభుత్వాల్లో కనీసం పట్టింపు కరువు. చెప్పులరిగేలా తిరిగితే కాని తమ సమస్యకు జవాబు దక్కేది కాదు. సాగుకు పైసల్ కావాలంటే రోజుల తరబడి నిరీక్షణ. ఎరువులు, విత్తనాల మాటెత్తాలంటే గుండె గుభేల్ మనేది. చెప్పులను వరుసలో పెట్టి విత్తనాలు, ఎరువులు పొందే దుస్థితి. అన్నీ కుదిరితే కరెంట్ ఎప్పుడొస్తదో ఎప్పుడు పోతదో తెలియని అయోమయం. ఇన్ని గడ్డు పరిస్థితుల నుంచి స్వరాష్ట్రంలో రైతు రారాజుగా మారాడు. తాను నిలదొక్కుకుంటూ తన కాళ్లపై తాను నిలబడి సగర్వంగా గెలిచి నిలుస్తున్నాడు. రైతుకు వెన్నుదన్నుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుండగా అన్నదాతలు మురిసిపోతున్నారు. సమయానికి ఎరువులు, విత్తనాలు పంపిణీ.. నిరంతరం విద్యుత్ సరఫరా.. సాగుకు పుష్కలమైన నీరు.. మోడుబారిన చెరువుల్లో జల కళ.. వెరసి రైతుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొండంత అండగా నిలుస్తున్నారు. వీటితో పాటు అన్నదాతలకు ఆర్థిక కష్టాలు తీర్చేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా కర్షకులకు పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ పేరిట అందిస్తున్నారు. వినూత్న పథకాలతో సాగు రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. వ్యవసాయం చేసేందుకు వెనుకడుగు వేసిన రైతులే ఇప్పుడు జోరుగా సాగుబాట పడుతున్నారు. పంటలు పండిస్తూ ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నారు. తెలంగాణలో సాగు విప్లవంతో బీడు భూములే కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు.
పెరిగిన విస్తీర్ణం.. పంట ఉత్పత్తులు
నిజామాబాద్ జిల్లాలో 2016-17లో వానకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 3లక్షల 27వేల మెట్రిక్ టన్నులు. 2020-21 వానకాలంలో 5లక్షల 82వేల 534 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించారు. ప్రస్తుతం 2021 వానకాలంలో 8లక్షల నుంచి 9లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాలో 2016-17లో వరి ఉత్పత్తి కేవలం లక్షా 21వేల మెట్రిక్ టన్నులు మాత్రమే. 2020-21 వానకాలంలో కొనుగోలు చేసిన ధాన్యం 3లక్షల 75వేల 867 మెట్రిక్ టన్నులు. 2021 వానకాలంలో ధాన్యం అంచనా దాదాపు 6లక్షలు వస్తుందని భావిస్తుండగా 5లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఉభయ జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల్లో పంట ఉత్పత్తుల వివరాలు పరిశీలిస్తే గణనీయమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెట్టింపు స్థాయిలో ఉత్పత్తి వస్తుండడంతో దేశంలోనే రాష్ట్రం ప్రత్యేక గుర్తింపును సాధించింది. ఏటా కేంద్ర ప్రభుత్వం తరపున భారత ఆహార సంస్థనే రాష్ర్టాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ కొంత కాలంగా రైతును అడ్డం పెట్టుకుని మోదీ ప్రభుత్వం ఫక్తు రాజకీయం చేయడం ద్వారా సమస్య మొదలైంది. రాష్ట్ర సర్కారుకు మంచి పేరు వస్తుండడంతో కేసీఆర్ కీర్తిని దెబ్బ కొట్టేందుకు ధాన్యం సేకరణకు అడుగడుగునా కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. ఉత్తరాదిలో పంజాబ్లో మొత్తం వరి ధాన్యాన్ని సేకరిస్తున్న ఎఫ్సీఐ… రాష్ట్రంలో మాత్రం కొర్రీలు పెడుతుండడమే ఇందుకు నిదర్శనం.