ఆర్మూర్, అక్టోబర్ 31 : వరంగల్‌లో నవంబర్ 15న టీఆర్ఎస్ నిర్వహించనున్న విజయగర్జన సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో ఉన్న తిరుమల గార్డెన్ ఫంక్షన్ హాల్లో ‘విజయగర్జన’ నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు రాజ్యసభ సభ్యుడు కేఆర్.సురేశ్‌రెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబి.రాజేశ్వర్ హాజరయ్యారు. సమావేశం లో భాగంగా టీఆర్ఎస్ గ్రామ, వార్డు, పట్టణ, మండల కమిటీల నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయిం చి బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. విజయగర్జన సభకు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో మన రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్కు 60 లక్షలపై చిలుకు సభ్యత్వాలు ఉన్నట్లు తెలిపారు. టీఆర్ఎస్కు కార్యకర్తలే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో ఒక్క పథకమైనా ప్రతి ఇంటికీ అందుతోందన్నారు. రైతును రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సూచించారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన కేటీఆర్‌ను విమర్శించడం మానుకోవాలన్నారు. అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే ఆయనకు ఆర్మూర్ ప్రాంతానికి చెందిన రైతులు అడ్డుకుని తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాధ్యతలను, పనులను సమానంగా చూడాలన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. పార్టీ ప్రతినిధులుగా ప్రభుత్వం చేసిన పనుల గురించి చెప్పుకునే అవకాశం కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఉందన్నారు. టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వరంగల్‌లో నిర్వహించతలపెట్టిన విజయగర్జనను విజయవంతం చేయాలని కోరారు. శాంతియుతంగా చేసిన ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం యావత్ భారత దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం పలుమార్లు సీఎం కేసీఆర్‌ను మెచ్చుకున్నారని గుర్తుచేశారు. ఐటీ రంగంలో రాష్ట్రం దూసుకుపోతుండడంతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కాంగ్రెస్ నాయకులు మెచ్చుకున్నట్లు చెప్పారు. మనరాష్ట్ర రైతులు పండిస్తున్న పంటల సాగు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. నిరుత్సాహానికి గురి కాకుండా రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభకు భారీసంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో తరలివెళ్లాలన్నారు. అనంతరం ఎంపీ సురేశ్‌రెడ్డి, ఎమ్మె ల్యే జీవన్‌రెడ్డిని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, వైస్‌చైర్మన్ షేక్‌మున్నా, టీఆర్ఎస్ నాయకులు కోటపాటి నర్సింహనాయుడు, పండిత్ ప్రేమ్, పండిత్ పవన్, ఖాందేశ్ శ్రీనివాస్, ఎంపీపీలు పస్క నర్సయ్య, వాకిడి సంతోష్‌రెడ్డి, మాస్త ప్రభాకర్, జడ్పీటీసీలు మెట్టు సంతోష్, ఎర్రం యమున ముత్యం, వైస్ ఎంపీపీ మోతె భోజకళా చిన్నారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.