డిచ్పల్లి, అక్టోబర్ 31: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు డిచ్పల్లి మండలం తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా ఉండేది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకున్న తర్వాత డిచ్పల్లి మండలం గులాబీ కంచుకోటగా మారింది. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రతి సందర్భంలో 44వ నంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న పీపీ గంగారెడ్డి గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడే జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమై ఉద్యమకార్యాచరణ పై చర్చించేవారు. డిచ్పల్లి మండల కేంద్రంలో మొట్టమొదటి సారిగా కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉద్యమాన్ని గ్రామగ్రామాన ఉధృతం చేయాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 6 ఏప్రిల్ 2004న డిచ్పల్లి మండలం మారూముల గ్రామమైన కొరట్పల్లిలో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని రాత్రి ఒంటి గంటకు కేసీఆర్ ఆవిష్కరించారు. అదే రాత్రి గ్రామంలోని ఓ భవనంపై బహిరంగ సభ నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేనే మన బతుకులు బాగుపడతాయని పిలుపునిచ్చారు. ఉద్యమ సమయంలో మండల ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని పట్టం కట్టారు. 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 స్థానాలు టీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. 23 గ్రామాలకు గాను 19 గ్రామాల సర్పంచులుగా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్న ప్రతిసారి కేసీఆర్ డిచ్పల్లి మండల ప్రత్యేకతను ప్రస్తావించేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డిచ్పల్లి మండలం టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. మెజార్టీ ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ వారే విజయం సాధిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు డిచ్‌పల్లిలో కనుమరుగయ్యాయి.
ఉద్యమానికి ప్రెస్‌క్లబ్ మద్దతు…
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమానికి డిచ్పల్లి ప్రెస్‌క్లబ్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. టీఆర్ఎస్ మాజీ ఎంపీ దివంగత నారాయణరెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసంలో అప్పటి ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సావల్కర్ శ్రీధర్‌రావు, లోకాని గంగారాం ఆధ్వర్యంలో కేసీఆర్‌ను కలిశారు. ఉద్యమంలో తాముసైతం ముందుంటామని ప్రతిజ్ఞ పూనారు. కేసీఆర్ జిల్లా కేంద్రానికి వెళ్లే సమయంలో డిచ్పల్లిలోని గంగారెడ్డి గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు గ్రామాల్లో ఉద్యమ విషయాలను అడిగి తెలుసుకునేవారు. రాష్ట్రం వస్తేనే మన బతుకులు బాగుపడతాయని కేసీఆర్ పదే పదే అంటుండేవారు.
ఉద్యమానికి ఊపిరి..
2001 టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తొలినాళ్లలోనే డిచ్పల్లి మండలంలో 18 ఎంపీటీసీలకు గాను 17 టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ రోజు నేను మెంట్రాజ్‌పల్లి గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉండడం నేటికీ మర్చిపోలేను. ఆ రోజు నుంచి నేటి వరకు డిచ్పల్లి మండ లం టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది.
-చింత శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు, మెంట్రాజ్‌పల్లి
ఉద్యమంలో ముందు వరుసలో
2001లో కేసీఆర్ పార్టీ స్థాపించారు. 2003లో ఉద్య మ సమయంలో అమరవీరుల స్తూపం గ్రామస్తుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. 2004లో కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఉద్యమంలో కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా డిచ్పల్లి కేంద్రంలో విజయవంతం చేశాం.
-శక్కరికొండ కృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు
కేసీఆర్ పిలుపుతో గ్రామమే కదిలింది
ఉద్యమనేత కేసీఆర్ పిలుపుతో మారుమూల గ్రామమైన కొరట్పల్లి గ్రామం ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించింది. కేసీఆర్ ఇచ్చిన ఏ పిలుపు ఇచ్చిన గ్రామస్తులు ఏకతాటిగా ముందుకువచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా గ్రామానికి కేసీఆర్ వచ్చి అమరవీరుల స్తూపం ప్రారంభించి బహిరంగ సభ నిర్వహించడం గ్రామానికే గర్వకారణం.
-లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ తొలి మాజీ ఎంపీటీసీ, కొరట్పల్లి
మహిళల్లో చైతన్యం
టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ పిలుపుతో ప్రతి ఉద్యమంలోనూ నేను పాల్గొన్నా. గ్రామగ్రామానా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మహిళలకు తెలియజేస్తూ చైతన్యపరిచాను. కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను ఎప్పటికీ మర్చిపోలేరు.
-దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, జడ్పీటీసీ సభ్యురాలు