వేల్పూర్, నవబంర్ 10: ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతులు పోరాటానికి సిద్ధం కావాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపిద్దామని అన్నారు. ఈ నెల 12న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బుధవారం వేల్పూర్‌లోని తన స్వగృహంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలా చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయన్నారు. యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆర్డర్ కాపీ తీసుకురావాలని మంత్రి డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేకుంటే గ్రామాల్లో తిరుగనివ్వమని స్పష్టం చేశారు. పంజాబ్‌లో వడ్లను ఎట్లా కొంటారు..? తెలంగాణలో ఎందుకు కొనరంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ యాసంగిలో వడ్లను కొలేమని అంటుంటే బండి సంజయ్ మాత్రం వరి సాగుచేయాలంటూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుత వానకాలం సీజన్‌కు సంబంధించి కొనుగోళ్లపై ఇప్పటిదాకా ఆర్టర్ కాపీ ఇవ్వలేదని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 12న వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, రైతులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలునిచ్చారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్లు నాగధర్, శేఖర్‌రెడ్డి, పుర్ణానందం, ఏలాయా, ప్రవీణ్‌రెడ్డి, జడ్పీటీసీలు రవి, బద్దం రవి, తలారి గంగాధర్, రాజేశ్వర్, ఎంపీపీలు ఉపేంద్ర, మహేశ్, శివలింగు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్లు కొట్టాల చిన్నారెడ్డి, ప్రకాశ్, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, నాయకులు సామ మహిపాల్, మిట్టాపల్లి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.