కామారెడ్డి/బీబీపేట, నవంబర్ 9 : ప్రతి ఒక్కరూ తాము పుట్టిన ఊరు, చదివిన పాఠశాల రుణం తీర్చుకునేందుకు మంచి ఆలోచనతో ముందుకురావాలని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. బీబీపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబుతో ప్రారంభించుకుందామన్నారు. మంగళవారం ఆయన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో తిమ్మయ్యగారి సుశీల-నారాయణరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పాఠశాలను సొంత డబ్బులతో నిర్మించిన సుభాష్‌రెడ్డి కుటుంబ సభ్యులను అభినందించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూనియర్ కళాశాలకు అనుమతి ఇస్తామని చెప్పారని, ప్రారంభోత్సవానికి హీరో మహేశ్‌బాబును పిలుద్దామన్నారు.శ్రీమంతుడు సినిమాతో ఎంతోమంది స్వగ్రామానికి సేవలు చేసేందుకు ముందుకు వచ్చారని, ఇంకా రావాలని కో రారు. రాష్టంలో బీబీపేట లాంటి ప్రభుత్వ పాఠశాలను ఇప్పటివరకూ చూడలేదన్నారు. తమ నియోజకవర్గాల్లో ఇలాంటి పాఠశాల నిర్మించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. పేరు, డబ్బు సంపాదించుకున్న తర్వాత సమాజానికి ఏదో ఒకటి చేయాలని కోరారు. చదువుకున్న పాఠశాల, పుట్టిన ఊరు కోసం ఎంతోకొంత చేయాలన్నారు. కాంట్రాక్టర్ సుభాష్‌రెడ్డి ఇప్పటికే జంగంపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, జనగామలో గ్రామపంచాయతీ కార్యాలయాలు నిర్మించారన్నారు. సీఎం కేసీఆర్ ఏడున్నర ఏండ్లలో మౌలిక వసతుల కల్పనకు, విద్యరంగానికి పెద్దపీట వేశారన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారం చేసుకొని దేశంలోనే నంబర్ వన్ గా నిలిచామన్నారు. 24 గంటలు ఉచిత విద్యుత్, ఇంటింటా తాగునీరు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. సాగు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో ముందంజలో ఉండగా, విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
మా నాయనమ్మ సొంతూరులో పాఠశాలను అభివృద్ధి చేస్తా…
తిమ్మయ్యగారి సుబాష్ రెడ్డి స్ఫూర్తితో తన నాయనమ్మ సొంతూరైన కోనాపూర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను అభివృద్ధిచేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గతంలో గ్రామ జ్యోతి కార్యక్రమానికి దోమకొండకు వచ్చినపుడు గుర్తు చేశారన్నారు. కోనాపూర్‌ను గతంలో పోసానిపల్లెగా పిలిచేవారన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రఘోత్తం రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సమితి చైర్మన్ అయాచితం శ్రీధర్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్ పాల్గొన్నారు.
జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషిచేస్తాం..
‘నభూతో నభవిష్యతి’ అన్నట్లుగా అద్భుతంగా పాఠ శాలను నిర్మించిన సుభాష్‌రెడ్డి-రజనీ దంపతులకు ప్రభు త్వం తరఫున ప్రత్యేక ధన్యవాదా లు తెలుపుతున్నాం. పాఠశాల పునర్నిర్మాణానికి స్ఫూర్తి సుభాష్‌రెడ్డి కుమారుడు నిహాంత్రెడ్డిని అభినం దించాలి. తన తండ్రిని శ్రీమంతుడులాగా పుట్టిన ఊరికి, చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలని ముందుకు పంపించడం గొప్ప విషయం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇలా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ కల, చాలా సార్లు క్యాబినెట్లో ప్రస్తావించారు. కేజీ టు పీజీలో భాగంగా దాదాపుగా వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరిక మేరకు మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో ఈ పాఠశాలలో ఇంటర్మీడి యట్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాం. కరోనా సమయంలో డిజిటల్ క్లాసుల ద్వారా విద్యార్థులకు పాఠాల బోధన సీఎం కేసీఆర్ ఘనతే. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం.
సీఎం కేసీఆర్ పిలుపుతోనే : ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గంలో ముమ్మరంగా అభివృద్ధి జరుగుతున్నదని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. బీబీపేట మండలంలోని జనగామ గ్రామాన్ని దత్తత తీసుకొని తన మిత్రుడు తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డితో చర్చించి వైట్‌హౌస్ లాంటి గ్రామ పంచాయతీ భవనం, గ్రంథాలయం నిర్మించామన్నారు. జనగామలో 50 డబుల్ బెడ్ రూం ఇండ్లను విల్లాస్ మాదిరిగా నిర్మించినట్లు తెలిపారు. జంగంపల్లిలో కూడా విల్లాస్ మాదిరిగా నిర్మించాలని సుభాష్‌రెడ్డిని కోరడంతో రూ.కోటీ 70లక్షల సొంత డబ్బులు ఖర్చు చేసి వంద ఇండ్లు నిర్మించారన్నారు. ఇప్పుడు రూ.6కోట్లతో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను పునర్నిర్మించడం గొప్ప విషయమన్నారు. పాఠశాల నిర్వహణకు పూర్వ విద్యార్థులంతా కలిసి రూ.కోటీ 20లక్షల వరకు కార్పస్ ఫండ్‌గా జమ చేశారని, తన వంతుగా 3లక్షలు కార్పస్‌ఫండ్‌గా అందజేస్తున్నట్లు విప్ ప్రకటించారు. అనంతరం ఎంపీ బీబీపాటిల్ మాట్లాడుతూ.. ఈ పాఠశాలను ఇంత అద్భుతంగా నిర్మించిన తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డిని అభినందిస్తున్నామని, పాఠశాల నిర్వహణ కోసం తన వంతుగా రూ.11 లక్షలు కార్పస్‌ఫండ్‌గా అందజేస్తున్నట్లు ప్రకటించారు.