వేల్పూర్, నవంబర్ 7: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ ర్యాడ మహేశ్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించనున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన ర్యాడ మహేశ్ (26) గతేడాది నవంబర్ 8వ తేదీన జమ్మూకశ్మీర్ మాచిల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందాడు. దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడికి జిల్లా నలుమూలల నుంచి కోమన్‌పల్లికి వచ్చి నివాళులు అర్పించారు. చదువుల్లో చురుగ్గా ఉండే మహేశ్‌కు ఇతర ఉద్యోగావకాశాలు వచ్చినా దేశంపై ఉన్న భక్తితో ఆర్మీలో చేరాడు. వీర జవాన్ కుటుంబానికి తనతోపాటు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి భరోసానిచ్చారు. బాధిత కుటుంబానికి సీఎం కేసీఆర్ పూర్తి అండగా ఉంటారని ఆరోజు మంత్రి తెలిపారు. వేల్పూర్ వాసిగా అన్ని విధాలుగా అండగా ఉంటానని ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబానికి మంత్రి అండగా ఉంటున్నారు. మహేశ్ త్యాగాన్ని గుర్తుంచుకొని కోమన్‌పల్లిలో మహేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించగా, నేడు మంత్రి వేముల ఆవిష్కరించనున్నారు.
వేల్పూర్ నుంచి కోమన్‌పల్లి వరకు బైక్ ర్యాలీ
వీర జవాన్ మహేశ్ విగ్రహావిష్కరణ సందర్భంగా వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో వేల్పూర్ నుంచి కోమన్‌పల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో సుమారు వెయ్యి బైక్‌లతో యువకులు పాల్గొననున్నారు. మంత్రి పిలుపు మేరకు ‘ చలో కోమన్‌పల్లి’ కార్యక్రమానికి యువకులు భారీ సంఖ్యలో కోమన్‌పల్లికి తరలిరానున్నారు. దేశం కోసం మహేశ్ చేసిన ప్రాణ త్యాగం భావి తరాలకు చిర స్థాయిగా గుర్తుండి పోయేలా..ఆయన పోరాటం దేశ సేవ కోసం స్ఫూర్తి నింపేలా ఉండాలన్న లక్ష్యంతో మంత్రి వేముల కోమన్‌పల్లిలో మహేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.