నిజామాబాద్ సిటీ/ఇందల్వాయి/ధర్పలి/బోధన్/ ఏర్గట్ల, నవంబర్ 7 : అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. నగరంలోని ఖిల్లారోడ్డులో ఉన్న క్రిసెంట్ బాలికల పాఠశాలలో ఆదివారం చేపట్టిన ఓటరు నమోదు ప్రత్యేక డ్రైవ్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాలో చిరునామా, పోలింగ్ స్టేషన్లు, నియోజకవర్గం మార్పు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు కోసం దరఖాస్తులు అందజేయాలని కోరారు. అనంతరం నవంబర్11 మౌలానాఅబుల్ కలాం ఆజాద్ జన్మదినం, ఎడ్యుకేషన్ డే సందర్భంగా నిర్వహిస్తున్న ఉర్దూ వ్యాసరచన పోటీలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా, తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించుకోవాలని ఇందల్వాయి, ధర్పల్లి తహసీల్దార్లు రమేశ్, జయంత్‌రెడ్డి సూచించారు. ఈనెల 30వ తేదీ వరకు ఓటరుజాబితాలో పేర్లు నమోదు చేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. 2022 జనవరి 1వ తేదీ వరకు పద్దెనిమిదేండ్లు నిండేవారు సైతం అర్హులని, యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ధర్పల్లిలో శనివారం 64, ఆదివారం 73 మొత్తం 137 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు.
బోధన్ పట్టణంలోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ద్యాకంగల్లీలోని నాలుగు కేంద్రాలను, శక్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో రెండు కేంద్రాలను, అంబేద్కర్ కాలనీలోని రెం డు కేంద్రాలను తహసీల్దార్ గఫార్‌మియా పరిశీలించా రు. ఆయా కేంద్రాల్లో రెండు రోజులుగా వచ్చిన దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీకరించిన దరఖాస్తులను వెంటవెంటనే ఆన్లైన్ చేయించాలని బీఎల్వోలకు సూచించారు.
ఏర్గట్ల మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా వచ్చిన దరఖాస్తులను గిర్దావర్ సదానంద్, జూనియర్ అసిస్టెంట్ ఎజాజ్, వీఆర్వో అశోక్, వీఆర్ఏలు స్వీకరించారు. ముప్కాల్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని డిప్యూటీ తహసీల్దార్ విక్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదుచేసుకోవాలని, జాబితాలో తప్పులుంటే దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఆయన వెంట అంగన్వాడీ టీచర్ అమీనా బేగం, రెవెన్యూ సిబ్బంది స్వరూప, నర్సయ్య తదితరులు ఉన్నారు.