బీర్కూర్ నవంబర్ 6 : తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి ఉన్న కిరీటం మాదిరిగా తిమ్మాపూర్ కొండపై ఉన్న తెలంగాణ తిరుమల దేవస్థానంలో కూడా శ్రీవారికి రెండు కిలోల బంగారంతో కిరీటాన్ని చేయిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేవస్థానంలోని శ్రీవారిని ఆయన సతీమణి పుష్పమ్మ, సోదరుడు శంభురెడ్డి, కుమారుడు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, కోడలు సోనీరెడ్డితో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఈనెల 21వ తేదీన తన మనుమరాలు స్నిగ్ధారెడ్డి వివాహం నేపథ్యంలో లగ్నపత్రికను తమ కుటుంబ ఇలవేల్పు అయిన శ్రీవారికి ముందుగా సమర్పించారు. అనంతరం ఆయన శ్రీవారి కిరీటం ఏర్పాటు కోసం వంద గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. స్పీకర్‌ను ఆదర్శంగా తీసుకుని ఆయన సోదరుడు శంభురెడ్డి 90 గ్రాములు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి రూ. 50 వేలు, కవితా వేణుగోపాల్(కరీంనగర్) వంద గ్రాములు, మద్దినేని నాగేశ్వర్రావు (రైతునగర్) వంద, ద్రోణవల్లి సతీశ్(మల్లాపూర్) 50, ద్రోణవల్లి అశోక్(మల్లాపూర్) 50, ఒడ్డేపల్లి సత్యనారాయణ(లక్ష్మాపూర్) ఆరు, పెండ్యాల నర్సింహులు(బీర్కూర్) ఐదు, ఢీకొండ సావిత్రీ మురళి(తిమ్మాపూర్) ఐదు, కొరిపెల్లి రామకుమారీ రాంబాబు(తిమ్మాపూర్) పది, కందకుర్తి లలిత(బీర్కూర్) 20, కందకుర్తి సంతోష్ గుప్తా(బీర్కూర్) 20, పెర్క శ్రీనివాస్(మైలారం) పది, సంధ్య శ్రావణ్(దేశాయిపేట్) 20, ఎర్వాల కృష్ణారెడ్డి(బాన్సువాడ) పది, గైని మారుతి(బరంగేడ్గి) 20, వెంకట నర్సరాజు(తిమ్మాపూర్) పది, కోల విఠల్‌రావు(కోటగిరి) 20, సుజాతా నాగేంద్ర(రుద్రూర్) ఆరు, కమ్మ సత్యనారాయణ(తిమ్మాపూర్) ఐదు, అవారి స్వప్న గంగారాం(బీర్కూర్) పది, దూలిగ కిషన్(బీర్కూర్) ఒక గ్రాము చొప్పున బంగారాన్ని విరాళంగా అందజేశారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. తెలంగాణ తిరుమల దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి చివరివారంలో లేదా మార్చి మొదటివారంలో ఉంటాయని, అప్పటివరకు ఆలయాన్ని పూర్తిగా ముస్తాబు చేసి బంగారు కిరీటాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో కల్యాణ మండపాన్ని వివాహాల కోసం సిద్ధం చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంతోపాటు పెద్ద గ్రామాల్లో రూ.70 లక్షల వ్యయంతో సుమారు 68 కల్యాణ మండపాలను నిర్మిస్తున్నామన్నారు. పూర్తయిన కళ్యాణ మండపాల్లో మొదటి పెండ్లి ఉచితంగా చేసుకోవచ్చని, అనంతరం ఒక్కో వివాహానికి రూ.ఐదు వేల చొప్పుల చార్జీలను వసూలు చేసి నిర్వహణ కోసం ఉపయోగిస్తామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 150 కుల సంఘాలను నిర్మించామని తెలిపారు.
అటవీ భూముల్లో కబ్జా ఉన్న వారిని ఆదుకుంటాం..
2005 డిసెంబర్ 13వ తేదీ కన్నా ముందు అటవీ భూముల కబ్జాలో ఉన్నవారిని తప్పకుండా ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని స్పీకర్ తెలిపారు. గిరిజనులైతే వారికి అదేవిధంగా గిరిజనేతరులైతే మూడు తరాలు కబ్జాలో ఉంటే ప్రభుత్వం ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారని తెలిపారు.