ఏడు పదుల స్వతంత్ర భారతావనిలో ఇప్పుడిప్పుడే మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. పురుషులతో పోలిస్తే తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో వజ్రాయుధంగా భావించే ఓటుహక్కు ప్రయోజనాలను కాపాడడంలోనూ వారిప్పుడు ముందు వరుసలో నిలుస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పురుషులతో పోలిస్తే.. మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఓటర్ల మార్పులు, చేర్పులపై వచ్చిన వినతులను పరిశీలించిన భారత ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను ఈ నెల 5న ప్రకటించగా.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో పురుషుల కన్నా 85వేలమంది అధికంగా మహిళా ఓటర్లు నమోదయ్యారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 19.39 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 9.27లక్షలు, మహిళా ఓటర్లు 10.12లక్షలు ఉన్నారు. థర్డ్‌జెండర్ కేటగిరీలో 81 మందికి ఓటుహక్కు ఉన్నట్లుగా ముసాయిదా జాబితాలో వెల్లడించారు.
నిజామాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఓ వైపు లింగ వివక్ష, మరోవైపు సమాజంలో చిన్న చూపు. పురుషులకు ఎందులోనూ తక్కువ కాకున్నప్పటికీ వారిని దశాబ్దాలుగా వంటిల్లుకే పరిమితం చేసిన సమాజం మనది. చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, అవకాశాలను అందిపుచ్చుకోవడంలోనూ మహిళలపై చూపిన వివక్ష అంతా ఇంతా కాదు. ఒకప్పుడు బ్రిటీష్ పరిపాలన కాలంలో మహిళలకు కనీసం ఓటు హక్కు కల్పించడానికి వెనుకాముందు ఆలోచించిన సమయం. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం మన జాతీయవాదులంతా కలిసి ప్రజాస్వామ్య దేశంలో వారికి ప్రముఖమైన స్థానం కల్పించారు. ఏడు పదుల స్వాతంత్య్ర దేశంలో ఇప్పుడిప్పుడే మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో పురుషులతో పోలిస్తే తామేమీ తక్కువ కాదని గెలిచి నిలబడుతున్నారు. ఓటు హక్కు ప్రయోజనాలను కాపాడడంలోనూ వారిప్పుడు ముందు వరసలోనే నిలుస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పురుష ఓటర్లతో పోలిస్తే దాదాపుగా మహిళా ఓటర్ల సంఖ్యనే అధికంగా ఉండడం ప్రత్యేకతను చాటుకుంటోంది. రెండు జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాల్లో అతివలే పైచేయిగా నిలుస్తుండడం గమనార్హం.
పెరిగిన మహిళా ఓటర్లు…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మహిళా మణుల చేతుల్లోకి ప్రజాస్వామ్యంలో కల్పించిన ఓటు అనే వజ్రాయుధం చేరింది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మహిళలదే పైచేయిగా నిలిచింది. ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ నాయకుల భవిష్యత్‌ను నిర్ణయించేది స్త్రీమూర్తులే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 19,39,229 మంది ఓటర్లున్నారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు కలిపి 13,14,593 మంది ఓటర్లుండగా, కామారెడ్డి జిల్లాలో మూడు నియోజకవర్గాలు కలిపి 6,24,636 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 9,26,900 మంది ఓటర్లుండగా అత్యధికంగా మహిళా ఓటర్లు 10,12,329 మంది ఉండడం విశేషం. ఇక జిల్లాల వారీగా ఓటర్ల గణాంకాలు పరిశీలించినా మహిళా ఓటర్ల సంఖ్యనే ఎక్కువగా కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, బాల్కొండ, ఆర్మూర్, బాన్సువాడ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 13.14 లక్షల మంది ఉన్నారు. ఇందులో 6లక్షల 23వేల 17 మంది పురుషులు ఉంటే 6లక్షల 91వేల 576 మంది మహిళా ఓటర్లున్నారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 6.24లక్షల మంది ఉన్నారు. ఇందులో 3లక్షల 3వేల 883 మంది పురుష ఓటర్లు, 3లక్షల 20వేల 753 మంది మహిళా ఓటర్లున్నారు.
ప్రజాస్వామిక హక్కు ఓటు…
ఓటు వజ్రాయుధంతో సమానం. ప్రజా ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో సామాన్య ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం. ఓటేయకుంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కోల్పోతారు. వజ్రాయుధం లాంటి ఓటుతో ఐదేండ్లు పాలించే ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు రాజ్యాం గం కల్పించిన మహత్తర అవకాశమిది. ప్రజాస్వామ్య దేశంలో గొప్పదైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండగా… కొత్తగా ఓటరుగా పేరు నమోదులోనూ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. కేవలం ఎన్నికల హడావుడి ఉన్నప్పుడే కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేస్తున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో చాలా మంది ఓటు హక్కు ఉండి ఓటు వేయలేక పోతున్నారు. మరి కొందరైతే సరిగ్గా సమాయనికి పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటరు జాబితాలో తమ పేరు లేదంటూ గగ్గోలు పెట్టడం పరిపాటిగా మారుతోంది. అలాంటి మార్పులు, చేర్పులకు, తప్పు ఒప్పుల సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏటా ఈ ప్రక్రియను చేపడుతుండడంతో ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో థర్డ్ జెండర్ కేటగిరీలో 81 మందికి ఓటు హక్కు ఉన్నట్లుగా ముసాయిదా జాబితాలో వెల్లడైంది. నిజామాబాద్ అర్బన్‌లో 17, నిజామాబాద్ రూరల్ 4, బాన్సువాడ 4, బోధన్ 1, బాల్కొండ 3, జుక్కల్ 14, ఎల్లారెడ్డి 5, కామారెడ్డిలో అత్యధికంగా 33 మంది ఉన్నారు.
జనవరిలో తుది జాబితా
భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన ప్రతి పౌరుడికి కుల, మత, ప్రాంత, లింగ వివక్ష లేకుండా ఓటు హక్కు కల్పిస్తోంది. భారత ఎన్నికల సంఘం ఏటా ఈ ప్రక్రియను క్రమపద్ధతిలో చేపడుతుంది. నిర్ణీత వయస్సు నిండిన వారందరికీ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చేపట్టిన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది. కొత్త ఓటర్లు, మార్పులు, చేర్పులతో వచ్చిన వినతులను పరిశీలించిన ఈసీ ఓటరు ముసాయిదా జాబితాను ఈ నెల 5వ తేదీన ప్రకటించగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వాటి వివరాలు వెల్లడయ్యాయి. ముసాయిదా జాబితా ప్రకారం ఉభయ జిల్లాల్లో గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు ఓటరు జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారితో పాటు తొలగించిన ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితాను భారత ఎన్నికల సంఘం విడుదల చేయగా జనవరిలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం సవరణల ప్రక్రియ కొనసాగుతోంది. తుది ఓటరు జాబితాకు ముందు ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు.