బీర్కూర్, నవంబర్ 6 : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సుమారు 21 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తుల సహకారంతో ఉపాధ్యాయులు వెంటనే బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరంచ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 152 మంది విద్యార్థులు చదువుతుండగా, శనివారం 101 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒంటి గంట కు మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల ముగిసిన వెంటనే నలుగురు విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి రావడంతో మిగతా విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఇంటికి వెళ్లిన అనంతరం వారు సైతం తమకు కడుపు నొప్పి వస్తోందని, వాంతులు అవుతున్నాయని చెప్పడంతో తల్లిదండ్రులతో పాఠశాలకు చేరుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలు నిర్మల వెంటనే ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. వారు అంబులెన్సులకు ఫోన్ చేసి 21 మంది విద్యార్థులను గ్రామస్తుల సహకారంతో బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించి వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాజు, ఎంఈవో నాగేశ్వర్రావు, వైస్ ఎంపీపీ కన్నెగారి కాశీరాం, సర్పంచ్ దొంతురం విఠల్ పాఠశాలకు చేరుకొని వివరాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా తహసీల్దార్ రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలను తెలుసుకొని బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు.