సదాశివనగర్, నవంబర్ 6: పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తూ నాణ్యమైన పాల ఉత్పత్తికి కృషి చేస్తున్నది విజయ డెయిరీ. అటు పాడి రైతుల ఆర్థికాభివృద్ధితోపాటు ఇటు ప్రజలకు స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను అందిస్తూ ముందుకు సాగుతున్నది. సబ్సిడీ ద్వారా రుణాలు, దాణా అందిస్తూ పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. దినదినాభివృద్ధి చెందుతున్న విజయ తెలంగాణ డెయిరీ గురించి కామారెడ్డి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ నమస్తే తెలంగాణకు వివరించారు.
జిల్లాలో ఎంత మంది పాడి రైతులకు సబ్సిడీ రుణాలిచ్చారు?
కామారెడ్డి జిల్లాలో 9 వేల మంది పాడి రైతులకు ప్రభు త్వం ద్వారా సబ్సిడీ రుణాలు అందించాం. మొత్తం 14వేల మంది రైతులను గ్రా మాల వారీగా గుర్తించాం. అందులో 9వేల మందికి రుణాలిచ్చాం. ఒక్కో రైతుకు రూ.80వేల విలువజేసే బర్రెను కొనుగోలు చేశాం. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, బీసీ, ఇతరులకు 50 శాతం సబ్సిడీపై పాడి రుణాలు అందించాం.
ఈ ఏడాది ఎంత మందికి సబ్సిడీ రుణాలు
ఇవ్వనున్నారు?
ఈ ఏడాది 470 మంది పాడి రైతులకు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు తయారు చేశాం. బాన్సువాడలో స్త్రీ నిధి, ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా పాడి రైతులకు రుణా లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా వివిధ గ్రామాల్లో రైతుల వివరాలను సేకరిస్తున్నాం.
సబ్సిడీ దాణా ఎంత ఇచ్చారు?
రాష్ట్ర ప్రభుత్వం కేవలం విజయ డెయిరీ ద్వారా పాలు పోసే రైతుల కోసం సబ్సిడీపై 100 టన్నుల దాణా సంచులను సరఫరా చేయగా పాల సేకరణ కేం ద్రాల ద్వారా అందజేశాం. దాణా కావాల్సిన రైతులు రూ.600 చెల్లించి సబ్సిడీ దాణాను పొందుతున్నారు.
పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారా?
జిల్లాలో ఇప్పటి వరకు 16 పశువైద్య శిబిరాలు ఏర్పా టు చేశాం. స్థానిక పాల సేకరణ కేంద్రాల వద్ద ఉచితం గా ఏర్పాటు చేసి పాడి పశువులకు వైద్య పరీక్షలతోపా టు మందులు అందజేశాం.
జిల్లాలో పాల సేకరణ ఎంత ఉన్నది?
జిల్లాలో రోజుకు 25 వేల లీటర్ల పాలను సేకరించేందుకు ప్రణాళికలు రూ పొందించాం. ప్రస్తుతం 17వేల లీటర్ల పాలు సేకరిస్తున్నాం. త్వరలో పాల సేకరణను పెంచేందుకు రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం.
ఎన్ని కేంద్రాల ద్వారా పాలను సేకరిస్తున్నారు?
జిల్లాలో 180 గ్రామాల్లో సేకరణ కేంద్రాలు, 12 బీఎంసీల ద్వారా పాలను రైతుల నుంచి సేకరిస్తున్నాం. త్వరలో మరో 40 సేకరణ కేంద్రాలను ప్రారంభించి పాల ఉత్పత్తులను పెంచుతాం. కొత్త సెంటర్ల కోసం పాల టెస్టింగ్ మిషన్లు తీసుకువచ్చాం. పాలు పోసిన రైతులకు సేకరణ కేంద్రాల ద్వారా 15 రోజులకోసారి డబ్బులను అందజేస్తున్నాం.
పాలను ఎలా విక్రయిస్తున్నారు?
విజయ డెయిరీ ద్వారా లీటరు పాలను ప్రైవేట్ కన్నా రూ. 4తక్కువగా విక్రయిస్తున్నాం. నాణ్యమైన చిక్కటి పాలను అందిస్తున్నాం. ఇప్పటికే 8 అవుట్‌లెట్స్, 3 పార్లర్ల ద్వారా పాలను సరఫరా చేస్తున్నాం. త్వరలో జిల్లాలో మరో 10పార్లర్లను ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం.
పాల ఉత్పత్తుల పెంపునకు ఏం చేస్తున్నారు?
జిల్లాలో పాల ఉత్పత్తులను పెంచేందుకు పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సిబ్బంది తక్కువగా ఉండడంతో ఉన్నవారితోనే పనులు చేస్తూ పాల సేకరణలో రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్నాం.