e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News కేంద్రంలో ధృతరాష్ట్ర పాలన

కేంద్రంలో ధృతరాష్ట్ర పాలన

  • గుండు, బండి.. దద్దమ్మలు
  • తెలంగాణ వడ్లు కొనాలని కేంద్రాన్ని ఎందుకు అడగరు?
  • రైతుల ప్రయోజనాలు పట్టని బీజేపీ ఎంపీలు
  • మోదీకి అదానీ, అంబానీల పైనే ఎక్కువ ప్రేమ
  • ధాన్యం కొనుగోళ్లలోకేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి వేముల ఆగ్రహం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశ ప్రజల దురదృష్టం వల్ల బీజేపీ ప్రభుత్వ పరిపాలన ధృతరాష్ట్ర పాలన, దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బీజేపీకి ప్రజల బాధలు, కన్నీళ్లు పట్టవని, కేవలం అదానీ, అంబానీలపైనే ప్రేమ ఒలకబోస్తోందని విమర్శించారు. రైతులు, ఉద్యోగుల మీద ప్రేమ లేదన్నారు.

నిజామాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఆర్‌ అండ్‌బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టెలిఫోన్‌, రైల్వే, ఎల్‌ఐసీ… డజన్ల కొద్దీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు అప్పగిస్తున్నదని విమర్శించారు. నెల రోజులుగా రైతుల కోసం టీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. వారం రోజులుగా పార్లమెంట్‌ ఉభయ సభ ల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనలు చేస్తుంటే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సింపుల్‌గా బాయిల్డ్‌ రైస్‌ తీసుకోం అంటూ సమాధానం ఇవ్వడం పద్ధతి కాదన్నారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రే స్వయంగా ధర్నా చేసినా, కేంద్రాన్ని కలిసి పరిస్థితిని వివరించినా పెద్దన్న పాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. యాభై ఏండ్లుగా సేకరిస్తున్నట్లే తెలంగాణలో మర ఆడించి ఇచ్చిన వడ్లను బియ్యంగా తీసుకోండని అడిగితే మూర్ఖంగా సమాధానాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.

- Advertisement -

గుండు, బండిలు దద్దమ్మలు…

కేంద్ర ప్రభుత్వం యాసంగి విషయంలో చేతులు ఎత్తేసిన నేపథ్యంలో వచ్చే సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని మంత్రి వేముల స్పష్టం చేశారు. ‘మా రైతులు తుకాలు వేస్తున్నారు.. ఏ వడ్లు తీసుకుంటరో చెప్పండి..’ అంటే మార్చిలో చెబుతామని కేంద్రం సమాధానం ఇవ్వడం బాధాకరమన్నారు. అప్పటి వరకు తుకాలు వేసుకోకుండా ఆగాల్నా అంటూ ప్రశ్నించారు. మనం ఒకటి మాట్లాడితే బీజేపీ వాళ్లు సంబంధం లేకుండా మరోటి అంటున్నారని మండిపడ్డారు. గుండు, బండి సంజయ్‌లు ఎంపీలుగా ఉన్నప్పటికీ తెలంగాణ రైతులకు మేలు చేయలేని దద్దమ్మలుగా వారిని అభివర్ణించారు. రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేవలం రాజకీయం మాత్రమే కావాలని, ప్రజల ప్రయోజనాలు అక్కర్లేదన్నారు. రైతులు చనిపోయినా రాజకీయం కావాలే… ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో పరిపాలించడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడు వీరికి సరైన శిక్షను వేస్తాడన్నారు. పార్లమెంట్‌లో రైతుల కోసం పోరాటం చేస్తున్న టీఆర్‌ఎస్‌ ఎంపీలకే బాధ్యత ఉందా? బీజేపీ ఎంపీలు గుండు, బండిలు ఎంపీలు కాదా? అని నిలదీశారు. తెలంగాణ వడ్లు ఎందుకు కొనరో పార్లమెంట్‌లో అడుగొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటోడు కూడా కేంద్రాన్ని ఏమీ అడగడంటూ దుయ్యబట్టారు.

పనికొచ్చే పంటలే వేద్దాం…

యాసంగిలో వడ్లు కొనబోమని స్వయంగా కేంద్ర మంత్రే తేల్చి చెప్పిన తర్వాత రైతులు వరికి బదులుగా లాభాలు అందించే ఇతర పంటలు సాగు చేయడమే ఉత్తమమని మంత్రి హితవు పలికారు. గత యాసంగిలో 50లక్షల మెట్రిక్‌ టన్నులు బియ్యంగా తీసుకుంటామని చెప్పిన కేంద్రం ఇచ్చిన మాటను విస్మరించి కేవలం 24లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించిందని మంత్రి గుర్తు చేశారు. మిగిలిన 26 లక్షల మెట్రిక్‌ టన్నులు మర ఆడించిన బియ్యం సేకరణపై కేంద్రాన్ని నిలదీస్తే వచ్చే యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ వద్దంటూ బలవంతంగా కండీషన్‌ పెట్టించుకుని సంతకాలు తీసుకుందని అన్నారు. లిఖిత పూర్వక హామీ పేరుతో బీజేపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతూ రైతులను బలి చేస్తోందన్నారు. రైతులకు కండీషన్‌లు పెట్టి పరిపాలన చేస్తున్న ఏకైక వ్యక్తి మోదీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి అన్యాయపు ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. టెక్నికల్‌గా మాట్లాడుతూ బియ్యం సేకరణపై కొర్రీలు పెట్టి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. రైతులే లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందని, రైతులే లేకుండా పోతే నువ్వే ఉండవ్‌ అంటూ కేంద్ర సర్కారు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement