బోధన్ రూరల్, నవంబర్ 3: బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో డ్వాక్రా సంఘాల రుణాలను గోల్మాల్ చేసిన బాధ్యులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. గ్రామంలో మొత్తం 60 సంఘాలు ఉండగా.. ఇందులో ఏడు సంఘాల్లో సుమారు రూ.20 లక్షల నిధుల గోలుమాల్ జరిగినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. సంఘాల సభ్యులు రుణాలను సకాలంలో వాయిదాలను చెల్లించినప్పటికీ ఐకేపీ సీఏ, సీసీ బ్యాంకుల్లో చెల్లించకుండా సొంతానికి వాడుకున్నారు. దీంతో సభ్యులు ఆందోళన చేపట్టడంతో స్పందించిన అధికారులు గ్రామంలో రెండు రోజలు పాటు విచారణ చేపట్టారు. నిధుల వినియోగంలో గోల్మాల్ జరిగినట్లు నిర్ధారణ కావడంతో బాధ్యులపై చర్యలకు ఉపక్రమించారు. సీసీ వనితను సస్పెండ్ చేయడంతోపాటు సీఏ మనీషను విధుల నుంచి తొలగించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఏపీఎం గంగారాంనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నిధుల గోల్మాల్ వ్యవహారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. సీసీ చేతిలో సీఏ బలైనట్లు తెలుస్తోంది. సీఏను సీసీ ప్రేరేపించడంతోనే అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. డబ్బుల రికవరీకి సీఏపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఎర్రం పద్మ గ్రామ సమాఖ్యకు ఆదేశాలు జారీ చేశారు.
వెల్కటూర్‌లో రూ. 30 లక్షలు గోల్మాల్
మెండోరా, డిసెంబర్ 3: మండలంలోని వెల్కటూర్ గ్రామంలోనూ మహిళా సంఘాలకు సంబంధించి రుణాల గోల్మాల్ జరిగింది. మహిళా సంఘాల వీవో పద్మ బ్యాంకు రుణాలు తీసుకుని సొంతానికి వాడుకున్నట్లు డీఆర్డీవో చందర్ నాయక్ శుక్రవారం తెలిపారు. సుమారు రూ.30 లక్షలు గోల్మాల్ జరిగినట్లు చెప్పారు. 13 మహిళా సంఘాలకు తక్కువ వడ్డీతో వచ్చిన డబ్బులను ఇతర మహిళల పేరిట తీసుకుని తమ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఈ విషయం జిల్లా అధికారులకు తెలియడంతో విచారణ చేపట్టారు. ప్రభుత్వ సొమ్మును రుణాల పేరిట ఇతర మహిళల పేరుమీద తీసుకుని సొంతానికి వాడుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో పద్మను విధుల నుంచి తొలగించినట్లు డీఆర్డీవో తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సీసీ నాగరాజును సస్పెండ్ చేశామని, ఏపీఎం శ్యామ్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.