పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్‌కుమార్ 10వ సారి పగ్గాలు చేపట్టనున్నారు. మరో మూడు రోజుల్లో కొత్త ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీహార్‌లో కొలువుతీరనుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల మధ్య జరిగిన సమావేశంలో క్యాబినెట్ కూర్పుపై కూడా తుది నిర్ణయం జరిగిపోయినట్టు రాజకీయ వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం బీజేపీకే అధిక సీట్లు వచ్చినా, ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే మరోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారు. బీజేపీ, ఎల్జేపీలకు ఒక్కో డిప్యూటీ సీఎం పోస్ట్ దక్కే అవకాశాలున్నాయి. ‘ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి’ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీజేపీ-జేడీ(యూ)లు టికెట్లు పంచుకున్న శాతంలోనే మంత్రి పదవులను పొందడానికి అంగీకరించాయి. దీని ప్రకారం మంత్రివర్గంలో బీజేపీకి 15-16 స్థానాలు, జేడీ(యూ)కు 14, ఎల్జేపీ (రామ్ విలాస్)కి మూడు, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎస్పీ పార్టీలకు తలో మంత్రి పదవిని కేటాయించనున్నారు.
సీఎం పదవిని నితీశ్‌కే ఇవ్వాలని బీజేపీ నిర్ణయించడంతో మహారాష్ట్రలో మాదిరిగా అధికారంపై కూటమిలో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఇంచుమించు లేవు. ప్రధాని మోదీ అందుబాటును బట్టి కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ షెడ్యూలు బుధవారం లేదా గురువారం ఉండవచ్చు. బీహార్‌లో ఎన్డీఏ కూటమి 202 సీట్లతో ఘన విజయాన్ని దక్కించుకుంది. బీజేపీకి 89, నితీశ్ కుమార్‌కు చెందిన జేడీ(యూ)కు 85, కూటమి పార్టీలైన ఎల్జేపీ (రామ్ విలాస్)కి 19, హెచ్ఏఎం 5 , ఆర్ఎల్ఎస్పీ 4 సీట్లలో విజయం సాధించడంతో మరోసారి బీహార్‌లో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడానికి సిద్ధమైంది. కూటమి పార్టీల అంతర్గత చర్చల అనంతరం సంయుక్త లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించాలని, అందులో కూటమి శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవాలని నిర్ణయించారు. అనంతరం ఆ వ్యక్తే బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.