న్యూఢిల్లీ, జూలై 24 : నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు అసౌకర్యం కల్పించరాదని, అలాగే ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులను అస్సలు ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. శుక్రవారం ఇక్కడ 167వ ఆదాయ పన్ను దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి మాట్లాడుతూ.. పన్ను వసూళ్లకే ఐటీ శాఖ అధికారులు పరిమితం కావద్దని.. సేవ, సులభతర వ్యాపార నిర్వహణ, సమర్థత, న్యాయబద్ధతలపైనా దృష్టి పెట్టాలని కోరారు.
ఐటీ శాఖ ఎల్లవేళలా స్పందించేలా ఉండాలన్న మంత్రి.. గుర్తించడం, స్పందించడం, పరిష్కరించడం, సమీక్షించుకోవడం, సంస్కరించుకోవడం ప్రధానమని తెలిపారు. భారతీయ ఆర్థిక పరిణామక్రమంలో ఐటీ శాఖ 150 ఏండ్లకుపైగా మమేకమై ఉన్నదని గుర్తుచేసిన ఆమె.. మారుతున్న జాతి అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని చెప్పారు.