న్యూఢిల్లీ, జూలై 24 : బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ట్రేడర్లు ప్రాఫిట్ బుకింగ్నకు మొగ్గుచూపడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.2 వేలు తగ్గి రూ.1,47,200 పరిమితమైంది. వరుసగా రెండు రోజుల్లో గోల్డ్ ధర రూ.3 వేల వరకు తగ్గినట్టు అయింది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే నమోదు కావడంతో కిలో వెండి ఏకంగా రూ.5 వేలు తగ్గి రూ.2,24,700కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.2,29, 700గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,063.70 డాలర్లు పలుకగా, వెండి 58.59 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో మదుపర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, గత ఐదు రోజుల్లో వీటి ధరలు 12 శాతం ఎగబాకాయని విశ్లేషకులు వెల్లడించారు.