నిర్మల్ టౌన్, నవంబర్ 18: యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, రసాయన మందులపై సర్కారు నజర్ పెట్టింది. ఈసారి వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఇప్పటికే రైతులు యాసంగి సాగుకు విత్తనాలతో పాటు రసాయన మందులను కొనుగోలు చేస్తున్నారు. యాసంగిలో రైతులు నష్టపోకుండా నాణ్యమైన విత్తనాలు అందించే లక్ష్యంతో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు విత్తన డీలర్లపై నిఘా పెట్టారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గురువారం నుంచి నిర్మల్ జిల్లాలోని 245 విత్తన డీలర్లు ఎరువుల షాపుల్లో వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వం గుర్తించిన ఎరువులు, విత్తనాలు, రసాయన మందులను సేకరించి వాటి నమూనాలను హైదరాబాద్‌లోని ప్రత్యేక ల్యాబ్‌లకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో 35చోట్ల శాంపిళ్లను సేకరించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి ప్రధానంగా వేసవి సీజన్లో పొద్దుతిరుగుడు, మక్క, వేరుశనగ, చిరుధాన్యాల పంటలు సాగు పెరిగిన నేపథ్యంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆయా షాపుల్లో విత్తన బ్యాగుల లాట్ నంబర్లు, సర్టిఫైడ్ సీడ్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకంటామని హెచ్చరిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందులను కూడా విక్రయించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రసీదులు తప్పనిసరిగా రైతులకు అందించాలని సూచిస్తున్నారు.