కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో స్పెషల్ సమ్మరీ రివిజన్, ప్రత్యేక ఓటరు జాబితా- 2022పై మంగళవారం సమీక్షించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని, ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
నిర్మల్ టౌన్, నవంబర్ 16 : కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు నమోదును విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ఓటరు జాబితా-2022 రూపకల్పనపై నిర్మల్ కలెక్టరేట్లో జిల్లా మంగళవారం సమీక్ష నిర్వహించారు. శాసనమండలి సభ్యుల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నియమావళిని పాటి స్తూ ఓటర్ల వివరాలను కచ్చితంగా రూపొందించాలని సూచించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కోడ్ ఉల్లంఘిస్తే ఎంతటి చర్య లు తీసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయాలని, మార్పులు, చేర్పులు, పోలింగ్ బూత్ ల మార్పిడి వంటివి చేపట్టాలన్నారు. బీఎల్వోలు దరఖాస్తులు స్వీకరించాలని, విచారణ జరిపి ఓటు హక్కు కల్పించేలా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటా సర్వే నిర్వహించి కొత్త ఓటర్లను జాబితాలో చేర్పించాలని సూచించారు.
మొక్కలను సంరక్షించాలి…
హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. హరితహారం, మొక్కల సంరక్షణ, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్లో జిల్లా అధికారులతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజూ నీరు పట్టాలన్నారు. ఎండిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.