నిర్మల్ చైన్‌గేట్, నవంబర్ 16: గర్భిణులు కొవిడ్ టీకా తప్పనిసరిగా వేసుకోవాలని నిర్మల్ డీఎంహెచ్‌వో ధన్‌రాజ్ అన్నారు. ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఆశ నోడల్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు టీకాలు వేసుకోవడం ద్వారా వ్యాధి బారి నుంచి రక్షణ లభిస్తుందన్నారు. తల్లిపాల ద్వారా ప్రతిరక్షకాలు బిడ్డకు చేరి, శిశువుకు కూడా వ్యాధి బారి నుంచి రక్షణ కలుగుతుందన్నారు. గర్భిణులకు కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకితే కొందరిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, మరణాలు కూడా సంభవించే ప్రమాదం ఉందన్నారు. కొవిడ్ టీకాలపై ఏమైనా భయాలు, అనుమానాలుంటే గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. టీకా ప్రాధాన్యతను వివరించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ మాస్ మీడియా అధికారి బారె రవీందర్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
లక్ష్యం చేరుకోవాలి
భైంసా, నవంబర్, 16 :వ్యాక్సినేషన్ ప్రక్రియ నూరుశాతానికి చేర్చాలని డీఎంఅండ్ హెచ్‌వో ధన్‌రాజ్ అన్నారు. పట్టణంలోని వ్యాక్సినేషన్ సెంటర్లను మంగళవారం పరిశీలించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌వో ఆశిష్ రెడ్డి, డాక్టర్ మతీన్, హెల్త్ సూపర్ వైజర్ ఖలీం ఉన్నారు.
కుభీర్ పీహెచ్సీ సందర్శన
కుభీర్, నవంబర్ 16 : కుభీర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంఅండ్‌హెచ్‌వో ధన్‌రాజ్ మంగళవారం సందర్శించారు. వ్యాక్సినేషన్ వివరాలను డాక్టర్అవినాశ్ను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 83 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక సామాజికవర్గం వారు వ్యాక్సిన్ పట్ల భయాన్ని వ్యక్తం చేస్తుండడంతోనే వందశాతం పూర్తి కాలేదని డాక్టర్ అవినాశ్ తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్తున్నా వారు స్పందిచడం లేదని చెప్పారు. కాయకల్ప అవార్డు సాధించిన కుభీర్ పీహెచ్‌సీని త్వరలో కేంద్ర బృందం సందర్శించనుందని అన్నారు. ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో ఆశిష్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
అవగాహన ఉండాలి
ఇంద్రవెల్లి, నవంబర్ 16 : కొవిడ్ వ్యాక్సిన్‌పై ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలని డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ అన్నారు. మండలంలోని చిన్నుగూడ, మార్కాగూడ, సట్వాజీగూడ, ఇంద్రవెల్లిలో డీపీవో శ్రీనివాస్‌తో కలిసి మంగళవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో టీకాలు వేసుకోని వారికి వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు టీకా వేయించుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 5 లక్షల మందికి కొవిడ్ టీకాలు వేశామని డీఎంహెచ్‌వో తెలిపారు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, వైద్యుడు శ్రీకాంత్, ఎంపీవో సంతోష్, మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, ఈవో శ్రీనివాస్ రెడ్డి, వైద్య సిబ్బంది జాదవ్ శ్రీనివాస్, పద్మ, లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.