మహబూబ్‌నగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రజలపై నోరు పారేసుకుంటే నాలుకలు తెగ్గొస్తమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లా కొత్తకోట, నారాయణపేట జిల్లాతోపాటు మక్తల్‌లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశాలు బుధవారం నిర్వహించారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయవాదం.. ఉగ్రవాదం కంటే ప్రమాదం అంటావా? తస్మాత్ జాగ్రత్త అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను హెచ్చరించారు. మాది ముమ్మాటికీ జాతీయవాదమేనని పేర్కొన్నారు. తెలంగాణను మీ స్వార్థం కోసం ఉమ్మడి రాష్ట్రంలో కలుపుకొని ఇక్కడి సంస్కృతీసంప్రదాయాలు, జీవన విధానాలకు భంగం కలిగించి అభివృద్ధిలో వివక్షత చూపడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పురుడు పోసుకున్నదని గుర్తుచేశారు. హామీలు అమలు చేయక ప్రజల తిరస్కారానికి గురైన రేవంత్ ద్రోహిగా చరిత్ర సృష్టించాడన్నారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ‘సర్’పై పార్టీ నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టారని తెలిపారు.
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్న లక్ష్యంతో కార్యకర్తలు అలుపెరుగని కృషి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నాయని, ఇచ్చిన హామీల అమలు కోసం రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ప్రజల వద్దకు వెళ్లి సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని కోరారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలని, రాష్ట్రంలోనే అత్యధికంగా సభ్యత్వాలు పాలమూరులో నమోదయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. సర్‌లో అర్హుల పేర్లు తొలగించకుండా చూడాలని సూచించారు.