భద్రాచలం/ బూర్గంపహాడ్, జూన్ 3 : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి తీర ప్రాంతాల్లో కలిగే అనర్థం, నష్టంపై అధ్యయనం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం(పీపీఏ) భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల్లో బుధవారం పర్యటించింది. తొలుత సారపాక ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్న బృందం సభ్యులు స్థానికంగా ఉన్న కేంద్ర జల సంఘం, నీటిపారుదల విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బూర్గంపహాడ్ మండలం కొల్లు, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోని రెండు ప్రాంతాల్లో పర్యటించిన బృందం సభ్యులు.. ముంపునకు గల కారణాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు.
అలాగే అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్‌ను బృందం సందర్శించి.. వరద ప్రభావం అక్కడ ఏ మేరకు ఉందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పోలవరం బ్యాక్ వాటర్‌తో ప్రధానంగా బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాలకు సమస్య ఉందని, అటు భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు బృందం గుర్తించినట్లు తెలుస్తోంది. 2022లో 80 అడుగుల మేర వచ్చిన వరదను సైతం అంచనా వేసుకుని స్థానిక అధికారుల నుంచి వివరాలు సేకరించారు. బృందంలో పీపీఏ సీఈవో సంజీవ్ వోహ్రా, ఎంఎస్ రఘురాం, సీఈ రమేశ్, డైరెక్టర్ సతీశ్, డిప్యూటీ డైరెక్టర్లు ప్రవీణ్, రవి, శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎస్ఈ సుబ్రహ్మణ్యప్రసాద్, ఈఈలు వెంకటేశ్వరరావు, మహ్మద్ జానీ, డీఈలు శ్రీనివాస్, మధుసూదన్‌రావు తదితరులు ఉన్నారు.