e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 25, 2022
Home News నిమిషాల్లోనే సేవలు

నిమిషాల్లోనే సేవలు

  • రూ.12 కోట్లతో నూతన ల్యాబ్‌లు, పరికరాలు
  • 200 ఐసీయూ పడకలు, 120 వెంటిలేటర్లు పెంపు
  • 45 రోజుల్లో అందుబాటులోకి రావాలి
  • అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
  • నిమ్స్‌లో అత్యాధునిక పరికరాల కోసం రూ.154 కోట్లు
  • త్వరలో పడకల సంఖ్య పెంపునకు హామీ

‘ప్రభుత్వ వైద్యంలో అనూహ్య మార్పులొచ్చాయి. కార్పొరేట్‌కు దీటుగా అన్నిరకాల సేవలు లభిస్తున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా నయం చేయడమే సర్కారు లక్ష్యం. ఇప్పుడున్న ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ దవాఖానలపై ఒత్తిడి తగ్గించేందుకు త్వరలో నగరానికి నాలుగువైపులా 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించబోతున్నాం. ఒక్కోటి వెయ్యి పడకల చొప్పున 4 వేల పడకలు అందుబాటులోకొస్తే ప్రైవేటు దవాఖానలకెళ్లే బాధ తప్పుతుంది. విశేష సేవలందిస్తున్న నిమ్స్‌లో ఒకప్పుడు బెడ్‌ దొరకడం గగనమని, ఇప్పుడున్న 155 ఐసీయూ పడకలకు అదనంగా 200 పడకలు, మరో 120 వెంటిలేటర్లు మంజూరు చేశాం.

45 రోజుల్లోనే ఈ పనులన్నీ పూర్తి కావాలి’ అని వైద్యారోగ్యశాఖాధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రూ.12 కోట్ల వ్యయంతో నిమ్స్‌ దవాఖాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ల్యాబ్‌లు, వైద్య పరికరాలను మంగళవారం డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. వివిధ విభాగాల అదనపు పరికరాల కోసం రూ.154 కోట్లు మంజూరు చేస్తామని, త్వరలో సాధారణ పడకల సంఖ్యనూ పెంచుతామని ప్రకటించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై భయపడొద్దని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి చెప్పారు.

- Advertisement -

వీవీఐపీల దగ్గర నుంచి నిరుపేద రోగుల వరకు కార్పొరేట్‌ వైద్యం అందించడంలో నిజామ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) ప్రత్యేక గుర్తింపు పొందింది. ఉమ్మడి రాష్ట్రంలో అంతంత మాత్రంగానే ఉన్న సౌకర్యాలతో వైద్యం అందడం గగనంగా ఉండేది. ఐసీయూలో బెడ్‌, వెంటిలేటర్‌ కావాలన్నా పెద్ద ఎత్తున సిఫార్సులు, రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో కొందరు అభాగ్యులు ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు లేకపోలేదు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ వైద్యశాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టితో అత్యాధునిక వైద్య సదుపాయాలు సమకూరాయి. తెలంగాణ ప్రభుత్వం ఐసీయూ పడకలను 115నుంచి 355కు, వెంటిలేటర్ల సంఖ్యను 89 నుంచి 209కి పెంచింది. దీంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు ల్యాబ్‌లను సైతం అందుబాటులోకి తెచ్చింది.

దక్షిణ భారత దేశంలోనే తొలి మెడికల్‌ జెనటిక్‌ ల్యాబ్‌..

వంశపారంపర్యం, పుట్టుకతోనే వచ్చే వ్యాధులను గుర్తించి చికిత్స చేసేందుకు ‘మెడికల్‌ జెనటిక్‌ ల్యాబ్‌’ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ల్యాబ్‌ను దక్షిణభారత దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగ దవాఖాన అయిన నిమ్స్‌లో ఏర్పాటు చేసినట్లు మెడికల్‌ జెనటిక్‌ ల్యాబ్‌ విభాగాధిపతి డాక్టర్‌ ప్రజ్ఞా రంగనాథ్‌ వివరించారు. ముఖ్యంగా ఇందులో రెండు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఒకటి మాలిక్యులర్‌ జెనటిక్‌, రెండోవది డీఎన్‌ఏ జెనటిక్‌ ల్యాబ్‌. ఈ పరీక్షలు ఖరీదైనవే కాకుండా అన్ని ల్యాబ్‌ల్లో అందుబాటులో ఉండటం అరుదని డాక్టర్‌ ప్రజ చెబుతున్నారు. సాధారణంగా ఎనిమియా, పికిల్‌సెల్‌, మజిల్‌ అండ్‌ నర్వ్‌, డీఎండీ, స్పైనల్‌ మస్క్యులర్‌ ఆర్టరీ (ఎస్‌ఎంఎ), తలసేమియా వంటి వంశపారంపర్య వ్యాధులను సకాలంలో గుర్తిస్తేనే సరైన వైద్యం అందించవచ్చు. సాధారణంగా క్యారోటైసింగ్‌ వంటి క్రోమోజోమ్‌ ఎనాలసిస్‌ లాంటి అరుదైన పరీక్షలను నిమ్స్‌లో నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.

బోన్‌ డెన్సిటీ ల్యాబ్‌..

వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది అనేక రకాల ఎముకల వ్యాధులతో బాధపడుతున్నారు. దీనిని ముందుగానే గుర్తించేందుకు బోన్‌ డెన్సిటీ పరీక్షలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఈ ల్యాబ్‌ తెలుగు రాష్ర్టాల్లోనే మొదటిసారిగా నిమ్స్‌లో ఏర్పాటు చేశారు. బోన్‌ డెన్సిటీ పరీక్ష ద్వారా ఎముకల సాంద్రత, పటిష్టత తెలుసుకోవచ్చని వెల్‌నెస్‌ సెంటర్‌ ఇన్‌చార్జి సత్యాగౌడ్‌ తెలిపారు. ఎముకలు బలహీన పడుతున్నట్లు అనుమానం ఏర్పడినా లేక 60 ఏండ్లు పై బడిన వారికి ఈ పరీక్షలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని సత్యాగౌడ్‌ వివరించారు.

మల్టీ డిసిప్లీనరీ రీసెర్చ్‌ యూనిట్‌ (ఎంఆర్‌యూ)

సాధారణంగా మల్టీ డిసిప్లీనరీ రీసెర్చ్‌ యూనిట్‌ అనేది ప్రతి వైద్య కళాశాలలో ఉంటుంది. కానీ నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో అత్యాధునిక వైద్యపరికరాలను సమకూర్చినట్లు ఎంఆర్‌యూ నోడల్‌ అధికారి డాక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. వైద్య పరిశోధనలను పెంచడమే ఈ ల్యాబ్‌ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ల్యాబ్‌లో నిమ్స్‌కు సంబంధించిన వైద్య విద్యార్థులతో పరిశోధనలు చేయించడంతో పాటు ఇతర వైద్య కళాశాలలకు చెందిన విద్యార్థులకు సైతం ప్రాజెక్టులు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఈ ల్యాబ్‌లో 16 ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. ఇద్దరు వైద్య శాస్త్రవేత్తలు, ముగ్గురు టెక్నీషియన్లు, ఒక నోడల్‌ అధికారితో ఎంఆర్‌యూ అందుబాటులోకి వచ్చింది.

న్యూమాటిక్‌ ట్యూబ్‌ సిస్టమ్‌..

సాధారణంగా రోగులు రక్త నమూనాలు ఇచ్చినప్పుడు వాటిని నమూనాల సేకరణ కేంద్రం నుంచి నిర్ధారణ పరీక్షలు జరిపే ల్యాబ్‌కు తీసుకెళ్తారు. నిమ్స్‌ ప్రాంగణంలో స్పెషాల్టీ బ్లాక్‌, ఎమర్జెన్సీ, మిలీనియం, ఓపీ తదితర బ్లాక్‌లు ఒకదానికొకటి కొంత కొంత దూరంలో ఉన్నాయి. ఒక్కో బ్లాక్‌లో ఒక్కో వ్యాధికి సంబంధించిన పరీక్షలు జరుపుతారు. అన్ని నమూనాలను సెంట్రల్‌ ల్యాబ్‌కు తరలిస్తారు. ఈ క్రమంలో ఒక్కో బ్లాక్‌లో సేకరించిన నమూనాలను సెంట్రల్‌ ల్యాబ్‌కు తీసుకురావాలంటే ప్రతి విభాగానికి మ్యాన్‌పవర్‌ అసరం. అంతే కాకుండా శాంపిల్స్‌ తరలించేందుకు కూడా సమయం పడుతుంది. దీనిని అధిగమించేందుకు రెండున్నర కోట్లతో న్యూమాటిక్‌ ట్యూబ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్‌నెస్‌ సెంటర్‌ ఇన్‌చార్జి సత్యాగౌడ్‌ తెలిపారు. ఒకేసారి 100 శాంపిళ్లను నిమిషాల్లోనే ఉన్న చోటు నుంచే సెంట్రల్‌ ల్యాబ్‌కు పంపవచ్చని ఆయన వివరించారు. అంతే కాకుండా పరీక్షల నివేదికలను సైతం ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నామని తెలిపారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement