అకుంఠిత దీక్షకు.. కఠోర శ్రమ తోడైతే.. విజయం దానంతటదే వెతుక్కుంటూ వస్తుందని తెలంగాణ యువ బాక్సర్
నిఖత్ జరీన్ మరోసారి నిరూపించింది. 2019 స్ట్రాంజా స్మారక టోర్నీలో స్వర్ణం చేజిక్కించుకున్న ఈ ఇందూరు చిచ్చర పిడుగు.. తన పిడిగుద్దులతో మరోసారి పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. కరోనా కష్టకాలంలో పడ్డ శ్రమకు తగ్గ ఫలితం దక్కించుకుంది!
న్యూఢిల్లీ: భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకంతో మెరిసింది. 2019లో ఇక్కడే పసిడి పట్టిన నిఖత్.. తన పంచ్ పవర్‌తో రెండోసారి బంగారు పతకం కొల్లగొట్టింది. బల్గేరియా వేదికగా ఆదివారం జరిగిన మహిళల 52 కేజీల ఫైనల్లో తెలంగాణ స్టార్ నిఖత్ 4-1 తేడాతో టెటియానా కోబ్ (ఉక్రెయిన్)ను చిత్తు చేసింది. సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత బూసనాజ్పై గెలుపొందిన నిఖత్.. ఆఖరి పోరులోనూ అదేస్థాయి ప్రదర్శన కనబర్చింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా హుక్, క్రాస్, జాబ్ పంచ్‌లతో విరుచుకుపడింది. 48 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ నీతూ 5-0తో ఎరికా ప్రిసియాండారో (ఇటలీ)పై నెగ్గి పసిడి ఖాతాలో వేసుకుంది.
స్ట్రాంజా టోర్నీలో రెండోసారి స్వర్ణం సాధించిన నిఖత్‌ను తెలంగాణ సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు. ఎల్బీ స్టేడియంలో ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్‌లో తుది పోరును వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘స్ట్రాంజా టోర్నీలో నిఖత్ జరీన్ రెండోసారి బంగారు పతకం సాధించడం దేశానికి, తెలంగాణకు గర్వకారణం. సీఎం కేసీఆర్, క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరీన్‌కు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు ప్రేమ్‌రాజ్, నిఖత్ జరీన్ తండ్రి జమీల్ తదితరులు పాల్గొన్నారు.
నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నా. నన్ను స్ట్రాంజా రాణి అని పిలవొచ్చు. ఈ పతకంతో పాటు సెమీస్‌లో టోక్యో ఒలింపిక్స్ రజత విజేత బూసనాజ్ను ఓడించడం ఎంతో ప్రత్యేకం. కామన్వెల్త్, ఆసియా క్రీడలకు ముందు ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
– నిఖత్ జరీన్, స్వర్ణ పతక విజేత